హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులను నిరాకరించడం చాలా సంతోషకరమని, అయితే ఇందులో కాంగ్రెస్ చేసిందేమీ లేదని సామాజిక కార్యకర్త, ఎన్జీటీ పిటిషనర్ గవినోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. తామేదో ఘనత సాధించామంటూ కాంగ్రెస్ ప్రచారం చేసుకోవడాన్ని తప్పుబట్టారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కృష్ణా జలాల తరలింపు కోసం ఏపీ సర్కారు డీపీఆర్ తయారీ పేరిట అక్రమంగా ప్రాజెక్ట్ పనులను చేపట్టిందని, ఇదే విషయమై ఏపీ ప్రభుత్వంపై తానే ఎన్జీటీలో కేసు వేశానని తెలిపారు. దాని ఆధారంగానే ఆర్ఎల్ఐఎస్ ప్రాజెక్టుకు ఈసీ మంజూరు చేసేందుకు కేంద్ర పర్యావరణ శాఖ నిరాకరించిందని తెలిపారు. ఈ ఘనత తమదేనంటూ కాంగ్రెస్ పార్టీ, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఏపీ సీఎస్‌గా, నీటి పారుదల శాఖ ప్రధాన కార్యదర్శిగా రాయలసీమ ప్రాజెక్ట్‌ను అనుమతులకు విరుద్ధంగా పూర్తి చేసి, తుదకు ఎన్జీటీతో తీవ్రస్థాయిలో చీవాట్లు తిన్న ఆదిత్యనాథ్దాస్నే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల సలహాదారుగా నియమించి తెలంగాణ పరువును ప్రభు త్వం తీసిందని మండిపడ్డారు. ఇకనైనా కృష్ణా నీటి వాటా త్వరగా తేల్చి తెలంగాణకు న్యాయం జరిగేలా కృషి చేయాలని, పెండింగ్‌లో ఉన్న పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.