హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ): ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలోని రహస్య భాండాగారాన్ని హైదరాబాద్‌లోని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తల బృందం పరిశోధించనుంది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు కూడా రత్నా భండాగారంలో ఉన్న గదులు, ఆభరణాలు, డిజైన్లను పరిశీలించనున్నారు. అయితే రత్నా భాండాగారంలో అదనంగా రహస్య నేల మాళిగలు ఉన్నాయని, ఇందులో భారీ మొత్తంలో నిధినిక్షేపాలతో నిండి ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో.. వీటన్నింటిని సాంకేతికత ఆధారంగా అధ్యయనం చేయనున్నారు. అనంతరం పూరీ జగన్నాథ్ కమిటీకి నివేదికను అందజేయనున్నారు. సెప్టెంబర్ 18న జరిగే సమీక్షలో పలు అంశాలను పరిశీలించనున్నారు. ఆలయ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాదే సమక్షంలో.. ఏఎస్ఐ, ఎన్జీఆర్ఐ టెక్నికల్ బృందం రత్న భాండార్ నిర్మాణాన్నీ అంచనా వేయనుంది. జియో ఫిజికల్, లైటింగ్ పరికరాలను వినియోగించనుంది. జీపీఆర్(గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్) సర్వే ద్వారా అధ్యయనం చేసేందుకు కమిటీ బృందం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని రూపొందించింది.
నిర్మాణాల నాణ్యతను తెలుసుకునేలా…
రత్న భండార్ నిర్మాణ నాణ్యతను తెలుసుకునేందుకు పరిశోధకులు అధ్యయనం చేయనున్నారు. నేల మాళిగల నిర్మాణం, ఐరన్ బీమ్స్ నాణ్యత, పై కప్పు, ప్రవేశ ద్వారాలు, స్టెయిన్లెస్ స్టీల్ బీమ్స్, గోడలపై ఉన్న పగుళ్లను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. దీని ఆధారంగా రత్న భండార్ల వినియోగం, ఆధునీకరణ వంటి అంశాలపై ఆలయ కమిటీ నిర్ణయం తీసుకోనుంది.
ఊహాగానాలకు చెక్…
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఉన్న రత్న భండార్ విషయంలో ఎన్నో ఊహాగానాలు ఉన్నాయి. ఈ ఈ నేపథ్యంలో రత్న భండార్ గుట్టును సాంకేతికత ఆధారంగా తెలుసుకునేందుకు ఈ అధ్యయనం సాయపడనుంది. అదే విధంగా రత్న భండార్‌లోనే ఉన్న రహస్య గదులను కూడా తెలుసుకోవడం కోసం ఈ అధ్యయనం చేస్తున్నట్లుగా తెలిసింది. దీనికోసం ఇప్పటికే రత్న భండార్‌ను తెరిచిన బృందం… అందులో ఉన్న నిధులు, ఆభరణాలు, సంపద మొత్తాన్ని తాత్కాలిక గదుల్లోకి తరలించారు. కానీ రహస్య గదుల విషయంలో ఇప్పటికీ చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే వాటన్నింటికి చెక్ పెట్టేలా ఈ అధ్యయనం చేయనున్నారు.