హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : ప్రముఖ కమ్యూనిస్టు పార్లమెంటేరియన్ గీతాముఖర్జీ పోరాట ఫలితమే మహిళా రిజర్వేషన్ బిల్లు అని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నేతలు ఉస్తేలా సృజన, నేదునూరి జ్యోతి, మండ సదాలక్ష్మి తెలిపారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సవరణలను వ్యతిరేకస్తూ గురువారం హైదరాబాదులో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2026 జనాభాను ఆధారంగా తీసుకోవాలని, మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ మహిళా కోట ఎస్సీ, ఎస్టీల మాదిరిగా ఉండాలని డిమాండ్ చేశారు.
నియోజకవర్గాల పునర్విభజనతో మహిళా రిజర్వేషన్ల బిల్లును జత కట్టడం సరికాదన్నారు. పురుషుల ప్రాతినిధ్యానికి నష్టం జరుగకుండా 50శాతం సీట్లు పెంచి 33శాతం మహిళా రిజర్వేషన్ కల్పించడం ఆక్షేపణీయమని తెలిపారు. ప్రస్తుతం ఉన్న సీట్లలోనే 33శాతం రిజర్వేషన్ల అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎండీ ఫమీద, జే లక్ష్మి, హైమావతి, గిరిజ కృష్ణమూర్తి, విజయలక్ష్మి, యాదమ్మ, శారద తదితరులు పాల్గొన్నారు.