హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): సిజేరియన్ కాన్పుల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. ఇదేమీ గర్వించదగ్గ విషయం కాదు. తీవ్ర ఆందోళనకర పరిణామం. మన దేశంలో దక్షిణాది రాష్ర్టాల్లోనే సీ-సెక్షన్లు ఎక్కువగా జరుగుతుండగా.. తెలంగాణ 62.2%తో అగ్రస్థానంలో ఉండటం భయపెడుతున్నది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్-6) (2023-24) రాష్ట్రంలో ప్రసవాల తీరుకు సంబంధించి పలు షాకింగ్ విషయాలను వెల్లడించింది. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో 70.1%, గ్రామీణ ప్రాంతాల్లో 59.5% సిజేరియన్లు నమోదు కాగా.. రాష్ట్రవ్యాప్తంగా 62.2%గా నమోదైనట్టు ఈ అధ్యయనం తెలిపింది.
ప్రైవేట్ దవాఖానలు ఎడాపెడా సిజేరియన్లు చేస్తున్నట్టు తాజా గణాంకాలతో మరోసారి స్పష్టమైంది. రాష్ట్రంలో ప్రైవేట్ దవాఖానల్లోనే అత్యధికంగా 83.9% సీ-సెక్షన్లు జరుగుతున్నాయి. ప్రైవేట్ దవాఖానల్లో జరిగే కాన్పుల్లో పట్టణ ప్రాంతాల్లో 82.9%, గ్రామీణ ప్రాంతాల్లో 84.4% సిజేరియన్లు నమోదవ్వడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో 48.1% సిజేరియన్లు నమోదు కాగా, పట్టణ ప్రాంతాల్లో 54.5%, గ్రామీణ ప్రాంతాల్లో 46.5% నమోదయ్యాయి. ఎన్ఎఫ్హెచ్ఎస్-6 రిపోర్టు ప్రకారం.. రాష్ట్రంలో ప్రతి మూడు ప్రసవాల్లో రెండు సీ-సెక్షన్ ద్వారానే జరిగాయి. రాష్ట్రంలో ప్రైవేట్ దవాఖానల్లో యథేచ్ఛగా సాగుతున్న కడుపు కోతల దందాను ఈ రిపోర్టు మరోమారు వెలుగులోకి తెచ్చినట్టయింది.
ఎన్ఎఫ్హెచ్ఎస్-5 ప్రకారం రాష్ట్రంలో 60.7% సిజేరియన్లు నమోదు కాగా, తాజాగా ఈ రేటు 62.2 శాతానికి చేరింది. ప్రైవేట్, ప్రభుత్వ దవాఖానల్లో సౌకర్యాల మధ్య అంతరం భారీగా ఉన్నట్టు రిపోర్టు అభిప్రాయపడింది. పెద్ద రాష్ర్టాల్లో తెలంగాణ 62.2%తో సీ-సెక్షన్లలో దేశంలో అగ్రస్థానంలో నిలువగా.. మన తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్(52.2%), తమిళనాడు(46.9%), కర్ణాటక(45.7%), కేరళ(41.3%) ఉన్నాయి. దేశంలో ప్రభుత్వ దవాఖానల్లో 16.9%ం సీ-సెక్షన్లు నమోదు కాగా, ప్రైవేట్ దవాఖానల్లో 54.1% నమోదైనట్టు రిపోర్టు వెల్లడించింది.
రాష్ట్రంలో 2 మార్చి 2024 నుంచి 31 డిసెంబర్ 2024 వరకు 28,312 నివాసాల్లో ఈ సర్వే నిర్వహించినట్టు ‘నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-6’ అధ్యయనం వెల్లడించింది. మొత్తం 24,407 మంది మహిళలు, 3,659 మంది పురుషులు ఈ సర్వేలో పాల్గొన్నట్టు తెలిపింది.

1