TG Weather | తెలంగాణలో రెండురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తెలంగాణ, రాయలసీమ, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది. ఒడిశా ఉత్తర తీర ప్రాంతం నుంచి తెలంగాణ వరకు ఇంటీరియర్ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది. నైరుతి బంగాళాఖాతం తమిళనాడు తీరంలోని ఉపరితల ఆవర్తనం నుంచి కోస్తా కర్నాటక వరకు తమిళనాడు, రాయలసీమ, దక్షిణ ఇంటీరియర్ కర్నాటక మీదుగా సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది.
ఈ క్రమంలో బుధవారం నల్గొండ, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. గురువారం కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది.