కాజీపేట, జూలై 5 : కాజీపేటలో నిర్మితమవుతున్న రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ (కోచ్ ఫ్యాక్టరీ) భవిష్యత్‌లో దేశంలోనే నంబర్ వన్‌గా నిలుస్తుందని రైల్వేబోర్డు చైర్మన్ సతీశ్‌కుమార్ ఆశాభావం వ్యక్తంచేశారు. కాజీపేట రైల్వే జంక్షన్ శివారు అయోధ్యపురంలో చివరి దశకు చేరిన కాజీపేట రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఆదివారం ఆయనతోపాటు కేంద్ర బోర్డు అధికారులు, దక్షిణ మధ్య రైల్వే అధికారుల బృందం సందర్శించింది. పనులను క్షుణంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. బోగీల పెయింటింగ్‌లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా చైర్మన్ సతీశ్‌కుమార్ మాట్లాడుతూ..
ఆర్ఎంయూను అధికారులు అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతంగా నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భవిష్యత్ తరాలకు కావాల్సిన బోగీలు తయారవుతాయని చెప్పారు. బోగీల ఉత్పత్తి, టెండర్ ప్రక్రియ దాదాపుగా ముగిసిందని, త్వరలో ఉత్పత్తిని ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఆర్ఎంయూలో పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని తెలిపారు. భూనిర్వాసితులు, స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రైల్వే నిబంధల ప్రకారమే ఉంటాయని చెప్పారు. ఆయన వెంట కేంద్ర రైల్వే బోర్డు అధికార బృందంతోపాటు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాత్సవ, సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ గోపాలకృష్ణన్, సీపీఎంఈ బిజయ్కుమార్రాత్, పీసీఎస్సీ అరోమా సింగ్‌ఠాకూర్, పీసీఎస్ఈ విజయ్ కుమార్రాత్, పీసీవోఎం పద్మజ ఉన్నారు.