హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : పత్రికా పంపిణీ వ్యవస్థను గిగ్ వర్కర్స్ చట్టం పరిధిలో చేర్చాలని కోరుతూ తెలంగాణ ప్రింట్ మీడియా డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల సత్యం శనివారం కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటింటికీ పత్రికలు పంపిణీ చేస్తూ వచ్చే కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటున్న డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థను ఒక వృత్తిగా గుర్తించాలని కోరారు.
తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవస్థపై ఆధారపడ్డ 30 వేల పత్రికా ఏజెంట్లు, హాకర్స్, పేపర్ బాయ్స్ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పత్రికా పంపిణీ వ్యవస్థను ఒక వృత్తిగా గుర్తించిందని స్పష్టంచేశారు.
ఏటా కర్ణాటక ఆవిర్భావ దినోత్సవం రోజున ఉత్తమ డిస్ట్రిబ్యూటర్లను గుర్తించి అవార్డుతోపాటు రూ.5 లక్షల ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్టు గుర్తుచేశారు. ‘మన రాష్ట్రంలోనూ దినపత్రికల పంపిణీ రంగంలో పనిచేస్తున్న వారికి 80% సబ్సిడీతో ఎలక్ట్రిక్ బైక్‌లు మంజూరు చేయాలి. సమావేశాలు నిర్వహించుకునేందుకు హైదరాబాద్‌తోపాటు జిల్లా కేంద్రాల్లో స్థలాలతోపాటు భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలి’ అని కోరారు.