హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ నిబంధనలు బేఖాతరు చేస్తున్నది. మహిళల సాధికారత, వారి ఉన్నత చదువులే లక్ష్యంగా ఏర్పాటుచేసిన వర్సిటీలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. గత నెలలో యూనివర్సిటీలో జరిగిన అధ్యాపకుల నియామకం(పార్ట్‌టైం)విషయంలో ఓ గిరిజన మహిళకు అన్యాయం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనకు దక్కాల్సిన అధ్యాపక ఉద్యోగం.. అర్హతలు లేని పురుష అభ్యర్థితో భర్తీ చేసినట్టు బాధిత గిరిజన మహిళ ఆరోపిస్తున్నది. ఈ విషయంలో యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ నిబంధనలు పాటించకుండా నా అనుకున్న వాళ్లకు ఉద్యోగం కట్టబెట్టారని పేర్కొన్నది.
కొత్తగా ఏర్పాటైన మహిళా యూనివర్సిటీలో ఎంఏ(లింగ్విస్టిక్) విభాగాన్ని ఏర్పాటుచేశారు. ఇందులో అధ్యాపకుని నియామకం(పార్ట్‌టైం)కోసం గత నెల 13న నోటిఫికేషన్ జారీ చేశారు. మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని నోటిఫికేషన్లో స్పష్టంచేశారు. దరఖాస్తుల స్వీకరణకు 20వరకు గడువు ఇచ్చారు. మొత్తం నలుగురు దరఖాస్తు చేసుకోగా, వీరిలో ఓ గిరిజన మహిళ కూడా ఉన్నారు. అనంతరం 23న ఉదయం రాత పరీక్ష, మధ్యా హ్నం ఇంటర్వ్యూలు నిర్వహించి నియామక ప్రక్రియ పూర్తిచేసి ఓ పురుషుడికి ఉద్యోగం ఇచ్చారు. అయితే, నోటిఫికేషన్లో పేర్కొన్నట్టుగా గిరిజన మహిళ పీజీ, ఎంపీల్తోపాటు నెట్లో ఉత్తీర్ణత సాధించా రు. మిగిలిన అభ్యర్థుల కంటే ఆమెకే అర్హతలు అధికంగా ఉన్నాయి. కానీ, ఆమెకు ఉద్యోగం రాలేదు. అన్ని అర్హతలు ఉన్న త నకు ఉద్యోగం రాకుండా.. ఇంటర్వ్యూలో అడ్డదిడ్డమైన ప్రశ్నలతో ఇబ్బంది పెట్టినట్టు సదరు మహిళ ఆరోపించింది. ఉద్యోగం పొందిన పురుష అభ్యర్థికి ఎంఫిల్ లేదని, పైగా సెట్ మాత్రమే క్వాలిఫై అయిన ఆయనకు ఉద్యోగం కట్టబెట్టారని పేర్కొన్నది. ఈ విషయంలో యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ వ్యవహరించిన తీరుపై సదరు మహిళ ఆం దోళన వ్యక్తం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నది.