Telangana | హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : నూతన సంవత్సరారంభం సందర్భంగా రాష్ట్రంలో జరిగిన మద్యం అమ్మకాలు ప్రభుత్వానికి కిక్కెక్కించాయి. వందల కోట్లల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. డిసెంబర్ నెలాఖరున 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల్లోనే ప్రజలు ఏకంగా రూ.926 కోట్ల విలువైన మద్యం తాగేశారు. ఈ మేరకు డిసెంబర్ నెల మద్యం అమ్మకాల వివరాలను బుధవారం తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వివరాల ప్రకారం ఒక్క డిసెంబర్ నెలలోనే సుమారు రూ.4 వేల కోట్ల విలువైన మద్యం అమ్ముడు పోయిందని తేలింది.
ఈ నెల చివరి రోజుల్లో 31న రూ.282 కోట్లు, 30న రూ.402 కోట్లు, 29న రూ.51 కోట్లు, 28న రూ.191 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. నూతన సంవత్సరం వేడుకల పేరిట అర్ధరాత్రిదాకా మద్యం దుకాణాలకు అనుమతులిచ్చి మందుబాబుల నుంచి భారీగా ఆర్జించినట్టు తేలింది. మద్యం అమ్మకాల ద్వారా భారీగా వచ్చిన ఆదాయాన్ని రైతు భరోసాకు ఉపయోగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
నూతన సంవత్సర వేడుకలకు ప్రత్యేక అనుమతుల ద్వారా ఎక్సైజ్ శాఖకు ఈ ఏడాది భారీ ఆదాయం సమకూరింది. 31న మొత్తం 287 ఈవెంట్లకు అనుమతులు ఇచ్చారు. వీటి ద్వారా రూ.56.46 లక్షల ఆదాయం సమకూరిందని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే 243 అనుమతులు ఇచ్చినట్టు పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో 44 పర్మిషన్లు ఇచ్చినట్టు వెల్లడించారు. ఈవెంట్ అనుమతుల్లో రూ.2.50 లక్షలతో ఒకటి, రూ.లక్షతో మూడు, రూ.50 వేలతో 7 అనుమతులు ఇచ్చినట్టు చెప్పారు. నిరుడు డిసెంబర్ 31న 224 అనుమతులు ఇవ్వగా రూ.44.76 లక్షల ఆదాయం వచ్చినట్టు తెలిపారు.