హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 4(నమస్తే తెలంగాణ): ‘మీరు బాస్మతి బియ్యం కొనేందుకు వెళ్తున్నారా? అయితే జాగ్రత్త. మీరు కొంటున్నవన్నీ ఒరిజినల్ బాస్మతి రకం కాకపోవచ్చు. బాస్మతి బియ్యానికి ఉండాల్సిన సుగుణాలన్నీ అందులో ఉండకపోవచ్చు. బాస్మతి పేరు తో మార్కెట్లో విక్రయిస్తున్న వివిధ రకాలపై సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నవన్నీ ఒరిజినల్ బాస్మతి రకం కాదని తేలింది. బాస్మతి పేరుతో మార్కెట్లో లభిస్తున్న పలురకాల్లో ఒరిజినల్‌గా ఉండాల్సిన సువాసన, పోషక విలువలు, నాణ్యత ఉండటం లేదని ఈ అధ్యయనం పేర్కొన్నది. అధిక దిగుబడి కోసం సృష్టిస్తున్న వంగడాలు బాస్మతి బియ్యంలోని సుగుణాలను హరిస్తున్నాయని తేల్చింది.
దేశంలో ఒరిజినల్ బాస్మతి పండించే రైతులు, ఎగుమతిదారుల నుంచి సేకరించిన శాంపిళ్లలో తొలుత 100 గ్రాముల విత్తనాలను సీడీఎఫ్‌డీ పరిశోధకులు వేరు చేశారు. ఆ తర్వాత ఆ బియ్యాన్ని పిండి చేసి.. అందులో నుంచి 100 మిల్లీగ్రాముల డీఎన్ఏను వేరు చేసి.. మల్టీప్లెక్స్ పీసీఆర్, జీనోటైపింగ్ పద్ధతి ద్వారా మార్కెట్లో లభిస్తున్న అన్ని రకాల బాస్మతి బియ్యం జన్యు పరిణామ క్రమంతో పోల్చిచూశారు. ఇందులో సంప్రదాయరకంగా పరిగణించే డెహ్రాడూన్, తరోరాయి, బాస్మతి-386, రణబీర్ బాస్మతి, బాస్మతి-217ని పోలినట్టుగా ఉండే నాన్ బాస్మతి బియ్యం మార్కెట్లోకి వచ్చినట్టు గుర్తించారు.
ఒరిజినల్ బాస్మతి రకాన్ని గుర్తించడానికి శాస్త్రీయ పద్ధతులు ఉన్నాయి. డీఎన్ఏ పరిణామ క్రమం, పోషకాల శాతం, జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజాన్ని గుర్తించడం వల్ల నాణ్యతను శాస్త్రీయంగా తెలుసుకొనే వీలున్నది. సామాన్యులు కూడా కొన్ని టెక్నిక్స్ ద్వారా గుర్తించే వీలున్నది. సువాసన లేకపోవడం, గంజి ఎక్కువగా రావడం, వండేటప్పుడు సగం ఉడకగానే మెతుకు విరిగిపోవడం వంటి లక్షణాలతో నాన్ బాస్మతి బియ్యాన్ని గుర్తించవచ్చని నిపుణులు చెప్తున్నారు.
మన దేశంలో హిమాలయ పర్వత ప్రాంతాలు, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలు, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ర్టాల్లో బాస్మతి రకం పండిస్తున్నారు. మన బాస్మతి బియ్యానికి విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉన్నది. ఏటా 39 లక్షల టన్నులను ఎగుమతి చేస్తున్నారు. దేశీయ బాస్మతిలో ఉండే మినరల్స్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లతో బాస్మతికి బ్రాండ్ అంబాసిడర్‌గా భారత్ వెలుగొందుతున్నది. నాన్ బాస్మతి రకం మార్కెట్లోకి రావడంతో ఒరిజినల్ రకం ట్రేడ్ బిజినెస్‌పై ప్రభావం చూపుతున్నదని, జన్యుమార్పిడి చేసిన బియ్యంతో పోషకాలు తగ్గి అనారోగ్య సమస్యలను కలిగించే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.