హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రెండేండ్లుగా బోసిబోయిన పల్లెలు సోమవారం కొలువుదీరిన పాలకవర్గాలతో కొత్త కళను సంతరించుకున్నాయి. ఇన్నాళ్లు పాలకవర్గాలు లేక, ప్రగతి జాడలేని గ్రామాల్లో ఆశలు రేకెత్తాయి. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 12,702 పంచాయతీల్లో సర్పంచులు, 1,12,000 మందికి పైచిలుకు వార్డు సభ్యులు ఎన్నికయ్యారు. వారితో ప్రత్యేకాధికారులు ఊరూరా ప్రమాణస్వీకారం చేయించారు. పార్టీలు, కులమతాలకతీతంగా గ్రామా ల అభివృద్ధికి కృషి చేస్తామని, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తిస్తానని, రాజ్యాంగ నియమాలకు కట్టుబడి ఉంటామని, నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యలను పరిష్కరిస్తామని వారంతా ప్రమాణం చేశారు. కోర్టు కేసుల కారణంగా 26 చోట్ల ఎన్నికలు జరగలేదు. పాలకవర్గాల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాల్లో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. ముస్తాబు చేసిన పంచాయతీ కార్యాలయాల్లో అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య పాలకవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. డప్పు చప్పుళ్ల మధ్య ర్యాలీలు తీశారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గాలకు గ్రామ ప్రముఖులు, వివిధ కులసంఘాల పెద్దలు, పార్టీల శుభాకాంక్షలు తెలిపారు. శాలువాలు కప్పి సత్కరించారు.
దామరవంచలో గందరగోళం
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామంలో ప్రమాణస్వీకార కార్యక్రమంలో గందరగోళం నెలకొన్నది. అధికారులు ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులకు గెలుపు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. మొదట బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి స్వాతి 3 ఓట్ల తేడాతో గెలిచినట్టు ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేశారు. కొద్దిసేమటికి కాంగ్రెస్ మద్దతుదారైన సుజాత ఒక్క ఓటుతో గెలిచినట్టు ప్రకటించి గెలుపు ధ్రువీకరణ పత్రం అందించారు. ఆ ఇద్దరూ తమ తమ పార్టీల నేతలతో కలిసి ప్రమాణస్వీకారం చేసేందుకు రావడంతో అయోమయం నెలకొన్నది. ఎవరితో ప్రమాణ స్వీకారం చేయించాలో అర్థంగాక అధికారులు ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు ప్రకటించారు.
వాంకిడిలో సర్పంచ్ దూరం
రాష్ట్రవ్యాప్తంగా కొత్త పాలకవర్గాలు ప్రమాణస్వీకారం చేయగా, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేయ గా, సర్పంచ్‌తోపాటు ఏడుగురు వార్డు సభ్యులు గెర్హాజరయ్యారు. 14 మంది వార్డు సభ్యులు ఎన్నిక కాగా ఉపసర్పంచ్, ఆరుగురు వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేయడం చర్చనీయాంశమైంది. ఉప సర్పంచ్ ఎంపికలో విభేదాలే కారణమని తెలుస్తున్నది.