హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : భూ వివాదాలపై రెవెన్యూ విచారణను కొత్త ఆర్వోఆర్ చట్టంలో వికేంద్రీకరిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కీలకమైన అంశాలను మాత్రం మరింత కేంద్రీకృతం చేసింది. ముఖ్యంగా సీసీఎల్ఏకి సర్వాధికారాలు కట్టబెట్టినట్టు కనిపిస్తున్నది. నూతన ఆర్వోఆర్ చట్టం ప్రకారం ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తామని చెప్తున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం.. వాటిని ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారో వెల్లడించడం లేదు. అప్పటివరకు ట్రిబ్యునల్ అధికారాలు సీసీఎల్ఏకే ఉంటాయని ప్రభుత్వం చెప్తుండటంతో అసలు ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తారా? లేదా? అన్న ప్రశ్న తలెత్తుతున్నది. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సీసీఎల్ఏ సుమోటోగా విచారణ జరుపవచ్చని, ఎవరైనా ఫిర్యా దు చేసి నా స్వీకరించవచ్చని పేర్కొన్నది. రాష్ట్రంలో దేవాదాయ శాఖ, వక్ఫ్, భూదా న్, అసైన్డ్, లావుణి పట్టా భూ ములు సహా లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటన్నింటిపై విచారణ జరిపే అధికారాన్ని ఒక్క సీసీఎల్ఏకే కట్టబెట్టడం అధికారాలను కేంద్రీకరించినట్టు అవుతుందని నిపుణులు విమర్శిస్తున్నారు. అలా కాకుండా కొన్ని అధికారాలను జిల్లా కలెక్టర్లకో, ట్రిబ్యునళ్లకో అప్పగిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.