హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ఈ నెలాఖరులోగా కొత్త రెవెన్యూ చట్టం-24(ఆర్వోఆర్ యాక్ట్)ను అమల్లోకి తేనున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. రెవెన్యూ ఉద్యోగుల జాబ్ చార్టుల రూపకల్పనకు ప్రత్యేక కమిటీ వేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో ఆదివారం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లతో మంత్రి సమావేశమమై మాట్లాడారు. 33 జిల్లాలకు సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను నియమిస్తామని, ధరణి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని చెప్పారు. ఎన్నికల సమయంలో బదిలీ చేసిన తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లను సొంత స్థానాల్లోకి బదిలీ చేస్తామన్నారు. కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఆఫీసులు నిర్మిస్తామని చెప్పారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిట్టల్ మాట్లాడుతూ తొమ్మిది నెలల్లో 3.50 లక్షల ధరణి సమస్యలు పరిష్కరించామని తెలిపారు. దసరాలోగా ఎన్నికల తహసీల్దార్లను సొంత స్థానాల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు. రవీందర్‌రెడ్డి, గౌతమ్‌కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.