Secretariat | హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): సచివాలయానికి వస్తున్న సందర్శకులపై భద్రతా సిబ్బంది రోజుకో కొత్తరకం ఆం క్షలు విధిస్తున్నారు. మధ్యాహ్నం 3-5 గంటల మధ్య సందర్శన వేళల్లో లోపలికి వెళ్లాలంటే చెకింగ్‌ల పేరుతో అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని సందర్శకులు వాపోతున్నారు. సచివాలయంలోనికి వెళ్లేందుకు మీడియాపాయింట్లోని కౌంటర్లో పాస్‌లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎవరైనా బృందంగా వెళ్లాలనుకుంటే వారిలో ఒక్కరి వివరాలు సమర్పించి, మిగతా వారి అంకె వేసి పాస్ ఇచ్చేవారు. కానీ బుధవారం నుంచి ఒక్క పాస్ ఒక్కరికి మాత్రమే జారీ చేస్తున్నారు.
అంటే.. సచివాలయంలోకి వెళ్లాలనుకునే ప్రతి ఒక్కరూ పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు చూసి, వివరాలన్నీ నమోదు చేసుకొని, ఫొటో తీసుకున్న తర్వాతే పాస్ మంజూరు చేస్తున్నారు. అయినా.. సచివాలయంలోకి వెళ్లే ప్రధాన గేటు దగ్గర మరోసారి ఆధార్ కార్డు చూపించాలని సిబ్బంది పట్టుబడుతున్నారు. దీంతో ఎన్నిసార్లు ఆధార్ చూపించాలంటూ సందర్శకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పైగా.. సచివాలయ ప్రధాన గేటుకు పది అడుగుల ముందు కొత్తగా ఒక బారీకేడ్‌ను ఏర్పాటు చేశారు. ముందుగా అక్కడ పాస్, ఆధార్ కార్డు పరిశీలించి పంపిస్తున్నారు.
పది అడుగులు వేయగానే ప్రధాన గేటు వద్ద మరోసారి పాస్‌ను పరిశీలిస్తున్నారు. లోపల సచివాలయ భవనంలోకి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద మరోసారి స్కానర్లతో చెక్ చేస్తున్నారు. ఇలా ఐదు దశలను దాటితే తప్ప సచివాలయ భవనంలోకి వెళ్లలేకపోతున్నామని సందర్శకులు వాపోతున్నారు. గతంలో ఇన్ని ఆంక్షలు లేవన్నారు. కొందరు మంత్రులు, అధికారుల పేషీల నుంచి ప్రత్యేక అనుమతితో లోనికి వెళ్తుంటారు. గతంలో వారిని నేరుగా లోపలికి పంపేవారు. కానీ ఇప్పుడు వారిని కూడా ఆధార్ చూపించిన తర్వాతే లోనికి పంపుతున్నారు. సచివాలయంలోకి కార్లల్లో వెళ్లేవారికి మాత్రం ఆంక్షలు లేకపోవడంపై సందర్శకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
సందర్శకులకు సచివాలయంలోనూ ఆంక్ష లు కొనసాగుతున్నాయి. సీఎం పేషీతోపాటు, సీఎంవో అధికారుల కార్యాలయాలు ఉండే ఆరో అంతస్థును ఒక నిషిద్ధ ప్రదేశంగా మార్చేశారు. ప్రత్యేక అనుమతి ఉన్నవారిని మాత్రమే ఆరో అంతస్తులోకి అనుమతిస్తున్నారు. వీఐపీ లు వెళ్లే లిఫ్టులు తప్ప మిగతా అన్నింటినీ ఐదో అంతస్తు వరకు మాత్రమే పరిమితం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇన్ని ఆంక్షలు లేవని సందర్శకులు చెప్తున్నారు.