హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ యూనివర్సిటీ మరో కొత్త పేటెంట్‌ను దక్కించుకున్నది. మొక్కలలో వ్యాధి నిరోధకాలుగా వ్యవహరించే ‘బౌమాన్-బిర్క్, కునిట్జ్’ ఇన్హిబిటర్లను వేరుచేసి శుద్ధీకరించే విధానానికి గాను ఈ పేటెంట్ లభించింది. స్కూల్ ఆఫ్ లైఫ్‌సైన్సెస్ శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ కే పద్మశ్రీ, డాక్టర్ ఎంకే అరుణశ్రీలు ఈ విధానాన్ని అభివృద్ధి చేశారు. వీరికి మరియమ్మ గుజ్జర్లపూడి, భారతి కొటార్యా సహకరించారు.
ప్రొఫెసర్ పద్మశ్రీ మాట్లాడుతూ.. మొక్కలలో ఉండే బౌమన్-బిర్క్, కునిట్జ్ ఇన్హిబిటర్లు పలు జీవసంబంధమైన విధులు నిర్వహిస్తాయని తెలిపారు. అవి మొక్కలను వ్యాధికారకాలు, తెగుళ్ల నుంచి రక్షిస్తాయని చెప్పారు. ముఖ్యంగా పత్తి, పల్లి, వంకాయ, టమాట, క్యాప్సికం, ఆముదం తదితర పంటలకు సోకే లెపిడోప్టెరన్, హెలికోవర్పా వంటి తెగుళ్ల నుంచి కాపాడుతాయని వివరించారు.