హైదరాబాద్ : రాష్ట్రంలో మరో ఐదు కొత్త ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను (New Degree Colleges) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కామారెడ్డి (Kamareddy ) జిల్లా మద్నూరు, భదాద్రి కొత్తగూడెం (Kottagudem) జిల్లా అశ్వారావుపేట, ఆదిలాబాద్ (Adilabad) జిల్లా ఇచ్చోడ, రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు, సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలకు నూతనంగా డిగ్రీ కాలేజీలను మంజూరుచేసింది.
గడిచిన మూడు విద్యా సంవత్సరాల్లో కొత్తగా 15 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆలియా, మహేశ్వరం, వికారాబాద్, పరిగి, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ధన్వాడ, మక్తల్, బడంగ్పేటలకు కాలేజీలకు మంజూరుచేయగా, తాజాగా మరో కాలేజీని కొత్తగా ప్రారంభించేందుకు అనుమతినిచ్చింది. 2023 -24 విద్యాసంవత్సరం నుంచే ఈ కాలేజీలను ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు.
బీకాం కంప్యూటర్‌సైన్స్, బీఏ, బీఎస్సీ లైఫ్‌సైన్సెస్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్ కోర్సులను నిర్వహించనుండగా, ఒక్కో కాలేజీలో 240 సీట్లకు అనుమతినిచ్చారు . ఈ కాలేజీలను పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కాలేజీల్లో ఒక్క ఎల్లారెడ్డిపేట మినహా మిగిలిన నాలుగు కాలేజీలను దోస్త్ జాబితాలో చేర్చారు.
దోస్త్ ప్రత్యేక విడుత ప్రవేశాల్లో ఈ కాలేజీల్లోని సీట్లను భర్తీ ఉంటుందని వివరించారు. ఎల్లారెడ్డిపేట కాలేజీకి సైతం ఒకట్రెండు రోజుల్లోనే కోర్సులకు అనుమతిరాగానే ఆయా కాలేజీని సైతం దోస్త్ జాబితాలో చేర్చడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల సంఖ్య 136 కు చేరుకుంది .