హైదరాబాద్, ఏప్రిల్ 16(నమస్తే తెలంగాణ) : భూభారతి పేరుతో కొత్తచట్టం తీసుకొచ్చిన ప్రభుత్వం రైతుల సమస్యలు తీర్చడంలో తాత్సారం చేస్తున్నది. ప్రభుత్వ చర్యలతో సాదాబైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియ ముందుకు సాగడంలేదు. మంత్రి పొంగులేటి పట్టుదలకు పోవడంతో అధికారులు అనాలోచిత నిబంధనలను రూపొందించారనే ప్రచారం జరుగుతున్నది. దీంతో ఈ ప్రక్రియ ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్నట్టు మారింది. ఈ కారణంగా 2020 నుంచి 8.90లక్షల మంది సాదాబైనామా దరఖాస్తుదారుల సమస్యలు తీరకపోగా ప్రభుత్వం కొత్త ఇబ్బందులను సృష్టిస్తున్నట్టు తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. రోజుకో నిబంధనతో 10లక్షల ఎకరాల క్రయవిక్రయ ఒప్పందాలపై నీలినీడలు కమ్ముకొంటున్నాయి. 2020లో ఆర్వోఆర్ చట్టం-1971 రద్దు కావడంతో నిలిచిపోయిన క్రమబద్ధీకరణ ప్రక్రియ నిరుడు ఆగస్టులో హైకోర్టు ఆదేశాలతో దరఖాస్తుల పరిశీలన, క్రమబద్ధీకరణకు అనుమతులు జారీ అయ్యాయి. అందుకు వీలుగా రైతులకు నోటీసులు జారీ చేశారు.
ఇదిలా ఉండగానే భూభారతి చట్టం సెక్షన్-6 ప్రకారం సాదాబైనామా క్రమబద్ధీకరణ అధికారం ఆర్డీవోకు అప్పగించడంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది. కొత్త విధానం ప్రకారం తహసీల్దార్ విచారణ జరిపి ఫైల్‌ను ఆర్డీవోకు పంపాల్సి ఉంటుంది. అయితే తాజాగా అమ్మినవారు, కొన్నవారు ఇద్దరూ అఫిడవిట్ సమర్పించాలనే నిబంధన తేవడంతో ఈ ప్రక్రియ మరింత జాప్యమైంది. ఈ విధానంపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇటీవలే అఫిడవిట్ అంశంపై సర్కార్ వెనుకడుగు వేసింది. వెంటనే దరఖాస్తులను సీసీఎల్ఏ కార్యాలయం జిల్లా కలెక్టర్లకు దరఖాస్తులను బదిలీ చేసింది. కాగా అందులో కొన్ని 2023లో కలెక్టర్ల లాగిన్‌లో రిజెక్ట్ కావడంతో కొత్త సమస్యలు తలెత్తాయి. అఫిడవిట్ నిబంధన కారణంగా కేవలం 7వేల దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్టు సమాచారం. 2014లో సాదాబైనామాలతో అమ్మిన భూ యజమానులు ఇప్పుడు అఫిడవిట్ ఇచ్చేందుకు ముందుకురాకపోవడంతో జిల్లాల్లో కలెక్టర్లు ఆయా దరఖాస్తులను తిరస్కరించారు. అఫిడవిట్ అవసరం లేదని ప్రభుత్వం నిబంధనలు సడలించినప్పటికీ ఇప్పటికే తిరస్కరణకు గురైన దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొన్నది. దీనిపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి స్పష్టత నివ్వలేదు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణ అధికారం తహసీల్దార్లకే ఉండేది. వారే సాదాబైనామాల దరఖాస్తులను పూర్తిచేసి రైతుకు ఊరట కల్పించే వీలుండేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దీనిని సవరించి, అధికారాలను బదలాయించి ఆర్డీవోలకు కట్టబెట్టింది. ఈ నేపథ్యంలోనే రిజెక్ట్ కాగా మిగిలిన దరఖాస్తులు వారి వద్దే ఉండిపోయాయి. కేవలం కొనుగోలుదారుల నుంచి అఫిడవిట్ తీసుకొనేలా జీవో76 విడుదల చేసినా రైతాంగానికి చిక్కులు ఎదురవుతున్నాయి. వీటిని సవరించాలని, మళ్లీ తహసీల్ద్దార్లకే అధికారం కట్టబెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఎలాంటి రిజిస్ట్రేషన్ చార్జీలు వసూలు చేయకుండా ఉచితంగా సాదాబైనామాలు క్రమబద్ధీకరణ చేసిన తీరును రైతులు గుర్తుచేస్తున్నారు. అదే విధానంతో ముందుకు వెళితే రైతుకు మేలు జరిగేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రెండున్నరేండ్లుగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా క్రమబద్ధీకరణకు నోచుకోకపోవడంతో అనేక సమస్యలు వస్తున్నాయని, ధరలు పెరుగడంతో సివిల్ వివాదాలు ఎదురవుతున్నాయని పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. రైతు భరోసా, రైతు భీమా పథకాలకు లబ్ధిపొందకుండా ప్రభుత్వ జాప్యం అడ్డంకిగా మారిందని ఆరోపిస్తున్నారు.