హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అత్యవసర సేవల కోసం కొత్తగా 466 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. 108 (అంబులెన్స్) , 102 (అమ్మ ఒడి), హర్సె (పార్థివ) సేవల కోసం వీటిని అందుబాటులోకి తేనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వైద్యారోగ్యశాఖ 204 అంబులెన్సులు, 228 అమ్మఒడి వాహనాలు, 34 హర్సె వాహనాలను కొనుగోలు చేసింది. వీటిని ఆగస్టు 1న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న 108, 102, పార్థివ వాహనాల పనితీరుపై మంత్రి హరీశ్‌రావు గత నెలలో సమీక్ష నిర్వహించారు. అత్యవసర సమయాల్లో ఆయా వాహనాల ద్వారా సేవలు అందిస్తున్న సిబ్బందిని అభినందించారు. వాహనాల పనితీరు, రిపేర్లు, మెయింటెనెన్స్ వంటివి ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నివేదికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. కాలం చెల్లిన అంబులెన్స్‌లు, అమ్మఒడి, హర్సె వాహనాలను వెంటనే తొలగించి, వాటి స్థానంలో నూతన వాహనాలను చేర్చాలని ఆదేశించారు. తద్వారా గర్భిణులు, రోగులను వేగంగా దవాఖానలకు చేర్చేందుకు వీలు కలుగుతుందని మంత్రి సూచించారు. మంత్రి హరీశ్‌రావు సూచనల మేరకు అధికారులు ఇప్పటికే కొత్త వాహనాలను కొనుగోలు చేసి, బ్రాండింగ్ పూర్తి చేశారు.
108, 102 వాహనాలతో పాటు పార్థివ దేశాలను తరలించే హర్సె వాహనాలు విలువైన సేవలు అందిస్తున్నాయి. అందులో కొన్ని వాహనాలు కాలం చెల్లిపోవటంతో సీఎం కేసీఆర్ ఆదేశాలతో 466 కొత్త వాహనాలు సమకూర్చుకొన్నాం. వాటి రాకతో ప్రజలకు వైద్య సేవలు మరింత వేగంగా అందుతాయి. గర్భిణులు, బాలింతలను ఉచితంగా చేర్చే 102 వాహనాలను మరింత సౌకర్యవంతంగా రూపొందించి అందుబాటులోకి తెస్తున్నాం. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించే విషయంలో ప్రభుత్వం ఎకడా రాజీపడటం లేదు. వైద్యారోగ్య రంగంలో తెలంగాణ దినదినాభివృద్ధి చెందుతూ ప్రజల మన్ననలు పొందుతున్నది.
– వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు