Telangana | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 12: ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తెలియని అసమర్థత. ఏడాది గడువకముందే అంతటా ప్రజావ్యతిరేకత. అడుగడుగునా కనిపిస్తున్న అవినీతి, పాలనావైఫల్యం. వెరసి ఏంచేయాలో పాలుపోని సీఎం రేవంత్‌రెడ్డి తన తప్పులను కప్పిపుచ్చుకోవడంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మరోమారు పిచ్చిప్రేలాపనలకు దిగారు. ‘స్ట్రెచర్.. మార్చురీ’ అంటూ ఇష్టారీతిన మాట్లాడుతూ తన నోటిదురుసును బయటపెట్టారు. అయితే, ప్రజాక్షేత్రంలో ప్రజాప్రతినిధులు అందునా.. ఓ సీఎం తన స్థాయిని మరిచి ఇలా వ్యాఖ్యానించడాన్ని తెలంగాణవాదులు తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వశర్మ చేసిన అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలను పార్టీలకతీతంగా ఖండించిన కేసీఆర్ లాంటి వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని సీఎం రేవంత్‌పై మండిపడుతున్నారు.
2022లో ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వశర్మ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘కరోనా టీకా, సర్జికల్ స్ట్రైక్స్‌పై కాంగ్రెస్ నేతలు తరచూ ప్రశ్నిస్తున్నారు. రాహుల్.. నిజంగా రాజీవ్‌గాంధీ కొడుకేనా? అని మేమెప్పుడైనా అడిగామా? అధారాలు చూపించమన్నామా?’ అంటూ బిశ్వశర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన కేసీఆర్.. బిశ్వశర్మపై మండిపడ్డారు. ‘రాహుల్‌గాంధీ అని కాంగ్రెస్ ఎంపీ ఉన్నడు. నాకు ఆయనతో సంబంధం ఏంలేదు. కానీ.. వాళ్ల తాత స్వతంత్ర పోరాటంచేసి, అనేక సంవత్సరాలు మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు.
వాళ్ల నాయనమ్మ, నాయన దేశం కోసం పనిచేసుకుంట చనిపోయిన్రు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఎంపీగా ఉన్నడు. రాజకీయాల్లో ఉన్నప్పుడు అనేక విషయాలు మాట్లాడుతం. ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున ప్రజాప్రతినిధులు అనేక ప్రశ్నలు అడుగుతరు. అట్లనే రాహుల్ గాంధీ కూడా ఒక ఎంపీగా ఏదో అడిగిండు. దానికి బీజేపీ నేత, అస్సాం సీఎం బిశ్వశర్మ.. ‘అనుచితంగా మాట్లాడొచ్చునా..? ప్రధాని మోదీ.. ఇది మీ బీజేపీ సంస్కారమా? ఇది మన దేశానికి మర్యాదనా? ఒకపెద్ద పార్టీ నేతను పట్టుకొని మీ ముఖ్యమంత్రి ఇలాంటి మాటలు అంటారా? ఆ మాటలు తలచుకొంటేనే నా బుర్ర బద్ధలైతున్నది. కండ్లల్ల నీళ్లు వస్తున్నయి.
మనం వేదాలు, భగవద్గీత, రామాయణం, మహాభారతం నుంచి ఇదే నేర్చుకొన్నామా? కన్నీళ్లతో బీజేపీ అధ్యక్షుడిని అడుగుతున్నా.. ఇలాంటి మాటలు మాట్లాడిన సీఎంను బర్తరఫ్ చేయండి’ అంటూ 2022 ఫిబ్రవరి 12న భువనగిరిలో నిర్వహించిన సభలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో రాహుల్‌కు పార్టీలకతీతంగా తన పూర్తి మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ఈ ఘటనను గుర్తుచేసుకొంటున్న నెటిజన్లు, తెలంగాణవాదులు.. పార్టీలకతీతంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌కు కూడా బాసటగా నిలిచిన కేసీఆర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని రేవంత్‌పై మండిపడుతున్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.