CPI | హైదరాబాద్, మార్చి 9 (నమస్తేతెలంగాణ): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సీపీఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం యాదవ్ పేరు ఖారారైంది. ఈ మేరకు హైదరాబాద్ మఖ్దూంభవన్‌లో ఆదివారం నిర్వహించిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. నెల్లికంటి సత్యం సోమవారం ఉదయం 10.00 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం నెల్లికంటి సత్యం నల్లగొండ జిల్లా సీపీఐ కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే స్నేహధర్మాన్ని పాటిస్తూ ఎమ్మెల్యే కోటాలో ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా, సీపీఐ కూడా బీసీ వాదానికి తలొగ్గింది.
బీసీలకే సీటు కేటాయించాల్సి వచ్చింది. అయితే, ఈ సీటు కోసం ఆ పార్టీలో గట్టి పోటీ నెలకొంది. నెల్లికంటి సత్యంతో పాటు సీనియర్ నేత చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు మధ్య పోటీ నెలకొంది. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో, ఆ తర్వాత వరంగల్‌లో జరిగిన రాష్ట్ర మహాసభల్లో నెల్లికంటి సత్యానికి పార్టీ తరఫున హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు తనకు కచ్చితంగా ఎమ్మెల్సీ సీటు ఇవ్వాల్సిందేనని ఆయన పట్టుబట్టినట్టు తెలిసింది. పార్టీలో మొదటినుంచి రెడ్డి, కమ్మ సామాజికవర్గాలకే ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయని, ప్రస్తుతం రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా కమ్మ సామాజికవర్గానికి చెందిన కూనంనేని సాంబశివరావు ఉన్నందున.. ఎమ్మెల్సీ సీటు బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సీటు ఎవరికి కేటాయించాలనే విషయమై సీపీఐ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.
రెండు సీట్లు అడిగితే ఒకటేనా?
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తమకు ఒకటే సీటు ఇవ్వడంపై సీపీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికార కాంగ్రెస్ పార్టీ మిత్రధర్మాన్ని విస్మరించిందని ఆ పార్టీ నేతలు అసంతృప్తికి లోనయినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రెండు ఎమ్మెల్సీ సీట్లు కేటాయించాలని పదేపదే విజ్ఞప్తి చేసినా.. రాష్ట్ర నాయకత్వం పెడచెవిన పెట్టడం, చివరికి ఒక్క సీటే కేటాయించడంపై సీపీఐ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరును మొదటినుంచీ అనుమానిస్తున్న సీపీఐ జాతీయ, రాష్ట్ర నాయకత్వం హస్తం పార్టీ పెద్దల నుంచి ఎమ్మెల్సీ సీటుపై స్పష్టమైన హామీ తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వాలని కోరారు. కానీ, కాంగ్రెస్ నుంచే అత్యధిక సంఖ్యలో ఆశావహులు ఉండటం, సామాజిక సమీకరణాల నేపథ్యంలో రెండు స్థానాలు ఇవ్వడం కుదరదని కాంగ్రెస్ అధిష్ఠానం తేల్చిచెప్పింది. ప్రస్తుతానికి ఒక్క సీటుతో సరిపెట్టుకోవాలని, మరోసారి చూస్తామని చెప్పడంతో సీపీఐ నేతలు దాంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు పార్టీకి, ఆ తర్వాత ప్రభుత్వానికి అండగా నిలబడినప్పటికీ.. కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని సీపీఐ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.