హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ, టోల్ వసూళ్లకు సంబంధించి 30 ఏండ్ల పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య ఒప్పందంపై ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయడాన్ని ప్రభుత్వం తప్పుపట్టింది. ఇందులో ప్రజాహితం ఏమీలేదని, పిల్‌ను కొట్టేయాలని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. నిర్వహణ, టోల్ వసూళ్లకు సంబంధించి 30 ఏండ్ల పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ కే మహేశ్‌కుమార్ దాఖలు చేసిన పిల్‌ను తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ నామారపు రాజేశ్వర్‌రావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
ఏజీ వాదనలు కొనసాగిస్తూ.. మే 28న హెచ్ఎండీఏ రూ.7,380 కోట్లకు 30 ఏండ్లపాటు పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య రాయితీ ఒప్పందం చేసుకున్నదని చెప్పారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది అవినాష్‌దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ఓఆర్ఆర్ నిర్వహణ, టోల్ వసూళ్లకు సంబంధించి ఐఆర్బీ గోలొండ ఎక్స్‌ప్రెస్‌తో ప్రాథమిక అంచనా వేయించకుండానే రాయితీ అగ్రిమెంట్‌పై హెచ్ఎండీఏ సంతకాలు చేయడం చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు. స్పందించిన హైకోర్టు.. సమచారహకు చట్టం కింద జీవోలు, ఇతర వివరాలు సంపాదించకుండానే పిటిషన్ దాఖలుచేయడం ఏమిటని పిటిషనర్‌ను ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 17కి వాయిదా వేసింది.