హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో ప్రమాదం జరిగిన సిగాచి కంపెనీలో శిథిలాల తొలగింపులో అధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఘటన జరిగి రెండు రోజులైనా ఎక్కడి శిథిలాలు అక్కడే దర్శనమిచ్చాయి. పేకమేడలా కూలిపోయిన భవన శిథిలాలను అక్కడ్నుంచి జేసీబీలతో తీసి పక్కన పోస్తున్నారు తప్పితే దానిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయడం లేదు. అలాగే, ప్రమాదం జరిగిన సోమవారం రాత్రి మొత్తం ఎలాంటి సహాయ చర్యలు చేపట్టలేదని కార్మికులు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పారిశ్రామిక వాడకు వస్తారని తెలిసిన తర్వాత మంగళవారం తెల్లవారుజాము నుంచి శిథిలాల తొలగింపు మొదలు పెట్టారని చెప్తున్నారు. రెండు జేసీబీలతోనే పనులు చేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం అక్కడి నుంచి వెళ్లిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ మళ్లీ నిలిపివేసి, మధ్యాహ్నం రెండున్నర తర్వాత మళ్లీ మొదలుపెట్టారని బాధిత కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీనియర్ సివిల్ జడ్జి జస్టిస్ సౌజన్య శిథిలాల తొలగింపులో జరుగుతున్న అలసత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తొలగించిన వ్యర్థాలను ట్రాక్టర్లతో బయటికు తరలించొచ్చు కదా? అని అక్కడున్న అధికారులను అడిగారు. అయితే, అందుకు గోడలు అడ్డంగా ఉన్నాయని, వాటిని తొలగించేందుకు కూడా కంపెనీ పర్మిషన్ కావాలని అధికారులు చెప్పడంతో ఆమె అసహసనానికి గురయ్యారు. తక్షణం ఏర్పాట్లను వేగవంతం చేసి, మృతదేహాలు ఏమైనా ఉంటే వెలికితీయాలని అధికారులను ఆదేశించారు. సహాయ చర్యలు వేగవంతం చేయడంలో ముఖ్యమంత్రి, అధికారులు విఫలమయ్యారని కార్మికులు విమర్శించారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.