హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): జాతీయస్థాయిలో ప్రముఖ ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారులు పలు మార్పులు చేశారు. దరఖాస్తు విధానం సహా మార్కుల వరకు కీలక మార్పులు చేశారు. గతంలో సెక్షన్-ఏలో (మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు) మాత్రమే నెగెటివ్ మార్కింగ్ విధానం ఉండగా, ఈ ఏడాది కొత్తగా సెక్షన్-బీలోనూ ప్రవేశపెట్టారు. గతేడాదే జేఈఈ మెయిన్‌లో సెక్షన్-బీని కొత్తగా ప్రవేశపెట్టారు. ఇందులో న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలను అడుగుతున్నారు. ఈ సెక్షన్లో ఒక్కో సబ్జెక్టుకు మొత్తం 10 ప్రశ్నలిచ్చి ఏవైనా 5 ప్రశ్నలను రాసుకొనే అవకాశం ఇచ్చారు. గతేడాది నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని అమలు చేయలేదు.
సెక్షన్-ఏలో గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం సబ్జెక్టుల నుంచి 20 చొప్పున మొత్తం 60 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం ప్రశ్నలకు తప్పనిసరిగా జవాబులు రాయాల్సిందే. వీటికి తప్పుగా సమాధానం రాస్తే నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
సెక్షన్-బీలో గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రంలో ఒక్కో సబ్జెక్టు నుంచి 10 చొప్పున మొత్తం 30 ప్రశ్నలు ఇస్తారు. విద్యార్థులు 15 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాయాలి. తాజాగా ఈ ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. తప్పు సమాధానాలు రాస్తే మార్కులు కోల్పోవాల్సి ఉంటుంది.
ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 2: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్ష ఫీజును స్వీకరిస్తున్నట్టు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో జూనియర్, సీనియర్, అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సుల రెగ్యులర్ పరీక్ష ఫీజును ఈ నెల 14లోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చని చెప్పారు. రూ.300 అపరాధ రుసుముతో ఈ నెల 16 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. పరీక్షలు వచ్చేనెలలో నిర్వహించనున్నట్టు తెలిపారు. తేదీలు, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. పూర్తి వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in ను సందర్శించాలని సూచించారు.