హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయి పోటీ పరీక్ష ‘నీట్ యూజీ 2022-23’ ఎంట్రెన్స్ టెస్ట్ ఆదివారం జరుగనున్నది. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు కొనసాగనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 25 పట్టణాల్లోని 115 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఇతర ప్రాంతీయ భాషల్లో నీట్ రాయొచ్చు. తెలంగాణలో సుమారు 60 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష సమయానికి అరగంట ముందే కేంద్రం గేట్లను మూసివేస్తారు. అభ్యర్థులు మధ్యాహ్నం 1:30 గంటలలోపే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష ఆఫ్‌లైన్ (పేపర్, పెన్ను) విధానంలో జరుగనున్నది. విద్యార్థులు పరీక్ష హాల్లోకి వెళ్లే ముందే అండర్‌టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. నీట్ ఎంట్రెన్స్‌కు గత ఏడాది వరకు మూడు గంటల సమయం ఇచ్చేవారు. 180 నిమిషాల్లో 200 ప్రశ్నలను అర్థం చేసుకొని 180 సమాధానాలు రాయాల్సి వచ్చేది. సమయం సరిపోవడంలేదని విద్యార్థులు నుంచి విజ్ఞప్తులు రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ సారి 20 నిమిషాలపాటు అదనపు సమయాన్ని కేటాయించింది.
నీట్ విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలు
పరీక్ష కేంద్రంలోకి అనుమతించేవి: పెన్ను, అడ్మిట్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ఫొటో.
పారదర్శకంగా ఉండే వాటర్ బాటిల్, 50 మిల్లీ లీటర్ల శానిటైజర్.
ఆధార్, పాన్, ఓటరు ఐడీ, వంటి గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి.
మాసు ధరించడం వంటి కొవిడ్ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.
పెన్నులు, ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలుతీసుకెళ్లవద్దు
ఉంగరాలు, చెవి పోగులు, నగలు, అభరణాలు వంటివి ధరించకూడదు.
అడ్మిట్ కార్డును విద్యార్థులు జవాబు పత్రం నుంచి పేజీని చింపకూడదు.
పరీక్ష సమయం ముగిశాకే కేంద్రం నుంచి బయటకి వెళ్లాల్సి ఉంటుంది.