హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : నీరా, ఇతర తాటి ఉత్పత్తుల అమ్మకాల ద్వారా కల్లుగీత వృత్తిదారులకు లబ్ధి చేకూర్చాలనే మాజీ సీఎం కేసీఆర్ సంకల్పం ఇప్పటికీ ఫలితాలను ఇస్తున్నది. ఆయన తీసుకొచ్చిన నీరా పాలసీని ప్రస్తుతం అప్గ్రేడ్ చేస్తున్నారు. ఇంటి వద్దకే నీరా వచ్చేలా ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణ రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్ సంస్థ ఈకొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ర్యాపిడో, ఓలా వంటి ఈ-బైక్ సర్వీసెస్లో ఈ-పార్శిల్ ద్వారా వినియోగదారులు కోరుకున్న చోటుకు నీరా డెలివరీ చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. తేనీరా కావల్సిన వారు 9121815999, 9666986888 నంబర్లకు కాల్ చేసి, ఎంత కావాలో చెప్పి, యూపీఐ ద్వారా నగదు చెల్లించి, లొకేషన్ పెడితే అక్కడికే తేనీరాను పంపుతున్నారు. ఇదివరకు బాటిళ్లలో నీరాను సరఫరా చేయగా, ప్రస్తుతం కోక్ మాదిరిగా 250 ఎంఎల్, 500 ఎంఎల్ టిన్ల మాదిరిగా సరఫరా చేస్తున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న ఈ టిన్స్తోపాటు అవసరమైతే లీటర్ బాటిళ్లలో సరఫరా చేస్తున్నారు. అవసరమైతే పబ్స్, రెస్టారెంట్లుకూ సరఫరా చేస్తామని నిర్వాహకులు అంటున్నారు. త్వరలో తేనీరా కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ను రూపొందిస్తామని, దానిద్వారా నీరాను, ఇతర ఉత్పత్తులను విక్రయిస్తామని నిర్వాహకులు తెలిపారు.
నీరాతోపాటు ఇతర తాటి ఉత్పత్తుల అమ్మకాలనూ చేపట్టనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. తాటి, ఈత బెల్లం, తాటి, ఈత సిరప్, పామ్ బూస్ట్, పామ్ గ్రా న్యుల్స్, తాటి ముంజలు, తాటి, ఈత పండ్లు, గేగులతోపాటు, ప్రత్యేకంగా తాటాకు, ఈతాకులతో తయారుచేసిన చాపలు, బుట్టలు, విసనగర్రలు, ఇంటి అలంకరణ వస్తువులను కూడా ఆన్లైన్ ద్వారా కూడా విక్రయిస్తామని నిర్వాహకులు చెప్పారు. వీటి విక్రయం వల్ల మరింత మంది గౌడ వృత్తిదారులకు ఉపాధి దొరుకుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. తాటి ఉత్పత్తుల విక్రయానికి సోషల్ మీడియాను ఉపయోగించుకుంటామని చెప్పారు.