ప్రతి ఒక్కరూ అన్నారు.. ఇది సాధ్యం కానేకాదని..
ప్రతి ఒక్కరూ అన్నారు.. మనం బతికుండగా చూడలేమని..
ప్రతి ఒక్కరూ అన్నారు.. ఇది గెలవలేని యుద్ధమని..
నమ్మింది ఒకే ఒక్కడు.. అది కేసీఆర్!
అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.. అతడే..అతడొక్కడే
అంటూ మొదలైంది.. ఆ ఉపోద్ఘాతం..
రానేరాదనుకొన్న తెలంగాణను తెచ్చి..
మేధావులు మెచ్చేలా.. జనానికి నచ్చేలా..
దేశం అచ్చెరువొందేలా.. ఎలా చేశారు?
ప్రముఖ జాతీయ వార్తాచానల్ ఎన్డీటీవీ గురువారం రాత్రి ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది.
తెలంగాణ ఎలా అభివృద్ధి చెందుతున్నది.. దాని వెనుక కేసీఆర్ మేధోమథనం ఎంత ఉన్నది.. సవివరంగా ససాక్షంగా.. సాధికారికంగా.. సాదృశ్యంగా.. వివరిస్తూ దాదాపు 45 నిమిషాల పాటు.. ఎన్డీటీవీలో ప్రసారం చేసిన ఈ కథనం ఎనిమిదేండ్లలో తెలంగాణ సాధించిన అద్భుతాలను కండ్లకు కట్టింది.
హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): మూడు కోట్లమందికి ముక్తకంఠమైన నాయకుడు.. ముందుండి తెలంగాణను తెచ్చిన సాధకుడు.. స్వరాష్ర్టాన్ని స్వర్ణమయం చేస్తున్న సేవకుడు.. కేసీఆర్. నాడొక ‘నామ’ మాత్రం.. నేడది అనంత ప్రజాశక్తి ప్రతిధ్వని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయాలను నిరసిస్తూ.. సమాన హక్కులు, అవకాశాలు, ఆత్మగౌరవం కోసం కేసీఆర్ సాగించిన అసాధారణ పోరాట ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం. 2014 జూన్ 2న కొత్త రాష్ర్టానికి మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించారు. జీవిత కాల కల నెరవేరిందన్న ఆనందమొక్కటే ఉన్నది. రాష్ట్రంలో ఎటు చూసినా కరువు. రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు. సాగు, తాగునీటి అవస్థలు. వలసలు, విద్యుత్తు కోతలు.. ఇలా లెక్కలేనన్ని సమస్యలు. ఒక్కొక్క పోగూ కలిపి వస్ర్తాన్ని సృష్టించినట్టు.. ఒక్కో ముల్లును తొలగించి బాటలేసినట్టు.. బంగారు తెలంగాణకు సీఎం కేసీఆర్ బాటలు వేశారు. నేడు తెలంగాణ ఒక అద్భుతం.. దేశానికే ఒక అబ్బురం. సీఎం కేసీఆర్ ముందుచూపు, దార్శనికత, డైనమిక్ లీడర్షిప్కు కండ్లముందు కనిపిస్తున్న సాక్ష్యం. దేశంలోని అత్యంత యువ రాష్ట్రం కేవలం ఏడేండ్లలో నభూతో నభవిష్యతి అన్న రీతిలో 450 సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నది. ప్రముఖ ఆంగ్ల వార్తా ఛానెల్ ఎన్డీటీవీ ‘తెలంగాణ: ఎ ఫీనిక్స్ రైజ్’ పేరుతో గురువారం ప్రసారం చేసిన కథనం తెలంగాణ విజయ ప్రస్థానాన్ని కండ్లకు కట్టింది. ఆ కథనంలోని ముఖ్యాంశాలు..
డబుల్ బెడ్రూమ్..
దేశంలో ఏ రాష్ర్టానికీ సాధ్యంకాని పథకం.. కనీసం ఆలోచనకు కూడా అందని పథకం.. తెలంగాణ ప్రభుత్వం చేసి చూపించింది. అదే డబుల్ బెడ్రూం పథకం. గ్రామీణ, పట్టణ పేదలు గౌరవప్రదంగా జీవించాలన్న అత్యున్నత సంకల్పంతో చేపట్టిన పథకమిది. వందశాతం సబ్సిడీతో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నది. ఇప్పటి వరకు రూ.20 వేల కోట్లతో దాదాపు మూడు లక్షల ఇండ్లు కట్టించింది.
24 గంటల విద్యుత్తు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అంతటా అంధకారమే. నిత్యం అన్ని రంగాలకు విద్యుత్తు కోతలే.. కానీ, సీఎం కేసీఆర్ అద్భుతమే చేశారు. అధికారం చేపట్టిన కేవలం 200 రోజుల్లో విద్యుత్తు కోతలు లేని రాష్ట్రంగా, 20 గంటలు అన్ని రంగాలకు నాణ్యమైన కరెంటు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణను మార్చేశారు. 2014లో తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 7,600 మెగావాట్లు. 2021 నాటికి అది 17,305 మెగా వాట్లకు చేరింది. 2023 నాటికి 25 వేల మెగావాట్లకు చేరుకోనున్నది. అంటే 9 ఏండ్లలో ఏకంగా 18 వేల మెగావాట్ల ఉత్పత్తి పెంచుతున్నది. భారతదేశ విద్యుత్తు చరిత్రలో ఇది అనితర సాధ్యమైన రికార్డు.
సాగునీటి పారుదల..
సాగునీటి రంగంలో తెలంగాణ విజయగాథ అనన్య సామాన్యం. ఏడేండ్లలో సాగునీటి ప్రాజెక్ట్‌లపై ప్రభుత్వం ఏకంగా రూ.1,28,000 కోట్లు ఖర్చు చేసింది. పాలమూరు రంగారెడ్డి, సీతారామా, దేవాదుల, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలను ఇలా ప్రతి ప్రాజెక్టూ దేనికదే ప్రత్యేకం. ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను కేవలం 36 నెలల్లో పూర్తి చేయటం కూడా ప్రపంచ రికార్డే. ఈ ప్రాజెక్టులతో తెలంగాణలో ప్రతి ఎకరానికి సాగు నీరు అందుతున్నది. భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి.
సర్కారు విద్యకు కార్పొరేట్ కళ..
ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు మెరుగైన విద్య అందించేందుకు టీఆర్ఎస్ ప్రభు త్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. 2014లో రాష్ట్రంలో 300 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండగా.. 2021 నాటికి వెయ్యికి పెంచారు. వేరే ఏ రాష్ట్రమూ ఈ ఘనత సాధించలేదు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో రూ.7 వేల కోట్లతో 26 వేల స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో తీర్చి దిద్దుతున్నారు. దీని ద్వారా 20 లక్షల మంది విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రోజు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ అందించడంలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నది.
ఇండస్ట్రీ అండ్ బిజినెస్..
యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్రంలో వర్తక, వాణిజ్యాలను విస్తృతంగా ప్రోత్సహిస్తున్నారు. టీఎస్-ఐపాస్ ద్వారా పరిశ్రమలకు 15 రోజుల్లో అనుమతులు ఇస్తున్నారు. గడిచిన ఏడేండ్లలో రాష్ర్టానికి 20 వేల పరిశ్రమలు వచ్చాయి. రూ.2,32,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. స్టార్టప్‌లకు కేంద్రంగా హైదరాబాద్ మారింది. ప్రస్తుతం 6,600 స్టార్టప్‌లు ఉన్నాయి. 2021-2022లో 14శాతం వృద్ధితో ఐటీ ఎగుమతులు రూ.1.5 లక్షల కోట్లకు చేరాయి. హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీ ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా ఎదిగింది. ప్రపంచానికి అవసరమయ్యే వ్యాక్సిన్లలో 33 శాతం ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. ఆర్అండ్ డీ, మాన్యుఫ్యాక్చరింగ్‌లో 9.7 బిలియన్ డాలర్ల పెట్టుబడితో అతిపెద్ద యూనిట్ వస్తున్నది. 5.60 లక్షల మందికి ఇది ఉపాధి కల్పించనున్నది.
దళితబంధు పండుగ
సమాజంలో దళితుల ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేందుకు దళితబంధు పథకాన్ని మొదలుపెట్టింది. రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తున్నది. లిక్కర్షాప్లు, మెడికల్ షాపుల్లో వారికి రిజర్వేషన్ అమలు చేస్తున్నది. వ్యాపారాలు చేసుకొనేలా ప్రోత్సహిస్తూ దళితులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు మార్గం సుగమం చేస్తున్నది.
మిషన్‌కాకతీయ కళ కళ..
కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులకు జీవం పోయటం తెలంగాణ సాధించిన మరో అద్భుతం. ఈ పథకం కింద 46,531 చెరువులు, కుంటలను పునరుద్ధరించారు. గ్రామీణ కులవృత్తులు, వ్యవసాయానికి ఇది ఎంతగానో మేలు చేసింది. ఎండాకాలంలోనూ రాష్ట్రంలోని చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి.
సాగుకు భరోసా..
రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో వ్యవసాయ ముఖచిత్రమే మారిపోయింది. రైతులకు అవసరమైన సమాచారంతో పాటు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించేలా ఏర్పాటు చేశారు. ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించారు. 2,601 క్లస్టర్లలో రైతు వేదికలు నిర్మించారు. రైతు బీమా పథకం కింద ఏకారణంగానైనా రైతు మరణిస్తే రూ.5 లక్షలు వారి కుటుంబసభ్యుల బ్యాంక్ ఖాతాల్లో జమయ్యేలా చేశారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద 3,587 మంది లబ్ధిపొందారు. రైతుబంధు పథకం దేశ వ్యవసాయ రంగంలో ఒక విప్లవం. ఎకరానికి ఏటా రూ.10 వేలు పెట్టుబడిసాయం అందించే ఈ పథకం, కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి రోల్ మాడల్. గడిచిన ఏడేండ్ల్లలో ఈ పథకం కింద రూ.50,448 కోట్లు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్, పంటల మార్పిడి, గ్రీన్ హౌస్, పాలీ హౌస్ లాంటి మార్పులను వ్యవసాయంలో ప్రోత్సహించారు. ధాన్యం ఉత్పత్తిలో నేడు తెలంగాణ రాష్ట్రం పంజాబ్‌ను వెనక్కు నెట్టి నంబర్ వన్ స్థానానికి చేరింది.
భూగోళానికి ఐదు చుట్లంత పైప్లైన్లు
తాగునీటిలో విప్లవాత్మక ప్రాజెక్ట్ మిషన్ భగీరథ.. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రెండు లక్షల కిలోమీటర్ల పైప్‌లైన్ వేసింది. ఇందుకోసం రూ.46వేల కోట్లు ఖర్చు చేసింది. ఈ పథకంలో వాడిన నీటిపైపులను భూమి చుట్టూ చుడితే ఏకంగా ఐదు వరుసలు వస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం రోజూ 3 వేల మిలియన్ లీటర్లు తాగునీరు మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్నది. ఈ పథకంతో ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్ జీవన్ మీషన్కు, 11 రాష్ర్టాలు అమలు చేస్తున్న తాగునీటి పథకాలకు మిషన్ భగీరథ పథకమే మూలం. కేంద్ర మంత్రి సాక్షాత్తు పార్లమెంట్‌లోనే ఈ మాట చెప్పారు.
తెలంగాణకు హరితహారం
దేశంలో అతిపెద్ద మొక్కలు నాటే కార్యక్రమం ఇదే. రాష్ట్రంలో గ్రీన్ కవర్‌ను 24 శాతం నుంచి 33 శాతానికి పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు 242 కోట్ల మొక్కలు నాటారు. గ్రామీణ స్థాయి వరకు నర్సరీలు ఏర్పాటు చేసి ఉద్యమంలా చేస్తున్న ఈ కార్యక్రమంలో 21 శతాబ్దపు అతిపెద్ద మొక్కలు నాటే కార్యక్రమంగా నిలిచింది.
గ్రామీణాభివృద్ధి..
మరే రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ పల్లెలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీల్లో జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పల్లె ప్రకృతి వనం, ఎకో పార్క్‌లు, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేశారు. పల్లె దవాఖానలతో ప్రతి గ్రామంలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేశారు.
పట్టణ మౌలిక వసతులు
తెలంగాణ ప్రభుత్వం రూ.7వేల కోట్లతో పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అనేక కార్యక్రమాలు చేపట్టింది. రోడ్లు, ైప్లెఓవర్లు నిర్మించింది. మున్సిపల్ బడ్జెట్లో 10 శాతం గ్రీన్ బడ్జెట్ కోసం కేటాయించింది. లా అండ్ ఆర్డర్లో, మౌలిక సదుపాయాల్లో దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నది. షీ టీమ్‌లతో మహిళలకు భద్రత కల్పించడంలో విజయవంతమైంది. ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతికతతో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మిస్తున్నారు.
ఆర్థికం అద్భుతం
ఏడేండ్లలో తెలంగాణ పూర్తిగా మారింది. పరిపాలన సౌలభ్యం కోసం 33 జిల్లాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ తలసరి ఆదాయం 2014-15 రూ.1.24 లక్షలు ఉంటే, 2021-22లో రూ.2.78 లక్షలకు పెరిగింది. జీఎస్డీపీ 2014-15తో పోలిస్తే 2021-22 నాటికి 128 శాతం పెరిగింది. రూ.5.06 లక్షల కోట్ల నుంచి రూ.11.55 లక్షల కోట్లకు చేరింది. దేశంలోని 10 అత్యుత్తమ గ్రామాల్లో తెలంగాణవే ఏడు ఉన్నాయి. 19 గ్రామాలకు జాతీయ గ్రామీణాభివృద్ధి అవార్డులు లభించాయి. అందరం కలిస్తే ఏదైనా చేయగలం.. చేసి చూపించగలం అని సీఎం కేసీఆర్ నిరూపించారు.
గొర్రెలు.. చేపపిల్లల పంపిణీ..
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేసి కుల వృత్తులను ప్రోత్సహించేందుకు గొర్రెల పంపిణీ, చేపపిల్లల పంపిణీ కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఈ పథకాలతో కులవృత్తులకు అండగా నిలిచింది. బతుకమ్మ చీరల తయారీతో సిరిసిల్ల చేనేత కార్మికులకు చేయూత ఇస్తున్నది.
కల్యాణలక్ష్మి.. షాదీ ముబారక్..
దేశం ముందెన్నడూ ఎరుగని పథకమిది. పేదింటి ఆడపిల్లల పెండ్లి కోసం.. బాల్య వివాహాలను అరికట్టేందుకు, ఆడపిల్లల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించేందుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించింది. ఒక్కో ఆడపిల్ల పెండ్లికి రూ.1,00,116 అందజేస్తున్నది. దీంతో రాష్ట్రంలో బాల్యవివాహాలు గణనీయంగా తగ్గాయి. ఇప్పటివరకు 11లక్షల కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధి పొందాయి.
ఆరోగ్యం..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మెడికల్ కాలేజీలు, దవాఖానల నిర్మాణంతో వైద్యరంగంలో సమూల మార్పులు తీసుకొచ్చారు. కంటి వెలుగు పథకం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమంగా నిలిచింది. 2018 నాటికి ఈ పథకం కింద 3.5 కోట్ల మందికి ఉచిత కంటి పరీక్షలు చేశారు. బస్తీ దవాఖానల ఏర్పాటు ఓ విప్లవాత్మక నిర్ణయం. 350 బస్తీ దవాఖానల ద్వారా పట్టణ పేదలకు అందుబాటులో ఉచిత వైద్యం అందిస్తున్నారు. అమ్మ ఒడి కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా 300 అంబులెన్స్‌లతో గర్భిణులకు ఉచిత రవాణా సౌకర్యం అందిస్తున్నారు. ఆరోగ్యలక్ష్మితో 19 లక్షల మంది మహిళలకు పోషకాహారం అందించారు. కేసీఆర్ కిట్ పథకంతో 98 శాతం ప్రసవాలు దవాఖానల్లోనే జరుగుతున్నాయి. దీంతో మాతా, శిశు మరణాలను గణనీయంగా తగ్గించారు.
అత్యంత విజయవంతమైన స్టార్టప్.. తెలంగాణ
ఎన్డీటీవీ ప్రోగ్రామ్‌ను చూడండి: మంత్రి కేటీఆర్ ట్వీట్
‘దేశం మొత్తంలో అభివృద్ధిలో దూసుకుపోతున్న అగ్రగామి రాష్ట్రం తెలంగాణ. అందుకే మన రాష్ట్రం అత్యంత విజయవంతమైన స్టార్టప్’ అన్న మంత్రి కే తారకరామారావు మాటలు అక్షర సత్యమని ప్రముఖ న్యూస్ చానల్ ఎన్డీటీవీ పేర్కొన్నది. ‘తెలంగాణ: ఏ ఫీనిక్స్ రైజెస్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘దేశంలోనే అత్యంత విజయవంతమైన స్టార్టప్ రాష్ట్రంగా తెలంగాణను నేను ఎందుకు పిలుస్తానో తెలుసుకోవాలంటే గురువారం రాత్రి 7 గంటలకు ఎన్డీటీవీ చూడాలి’ అని సూచించారు. గురువారం రాత్రి 7 గంటలకు, శనివారం రాత్రి 7.30 గంటలకు, ఆదివారం రాత్రి 10 గంటలకు ఎన్డీటీవీలో ఈ కార్యక్రమం ప్రసారం కానున్నది.
శక్తివంతంగా, ఉద్వేగభరిత పోరాటాలతో సాగిన ప్రయాణం తెలంగాణ కథ… టీఆర్ఎస్ పార్టీ కథ.. దార్శనికత కలిగిన నాయకుడు సీఎం కేసీఆర్ కథ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ ప్రయాణాన్ని మళ్లీ చూపించింది..
జై తెలంగాణ.. జై కేసీఆర్.. – ఎమ్మెల్సీ కవిత ట్వీట్..
ఎన్డీటీవీలో ప్రసారమైన ఈ కథనాన్ని వీక్షించేందుకు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి. ఎన్డీటీవీలో శనివారం రాత్రి 7.30కి, ఆదివారం రాత్రి 10 గంటలకు ఈ కథనం పునఃప్రసారం.