Medigadda Barrage | హైదరాబాద్, ఫిబ్రవరి13 ( నమస్తే తెలంగాణ ) : మేడిగడ్డ బరాజ్ ఘటనకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదిక సిద్ధమైంది. నిపుణుల కమిటీ ఆ నివేదికను ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కు అందజేయగా, అది కేంద్ర జల్‌శక్తిశాఖకు సమర్పించినట్టు ఢిల్లీ అధికారవర్గాలు వెల్లడించాయి. నివేదికను పరిశీలించి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి పంపించే అవకాశముందని పేర్కొన్నాయి. మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్ 7వ బ్లాక్‌లోని 20వ పిల్లర్ కుంగుబాటు, అన్నారం (పార్వతి), సుందిళ్ల (సరస్వతి) బరాజ్‌ల్లో సీపేజీలపై సాంకేతిక అధ్యయనం చేసి, తదుపరి చేపట్టాల్సిన పునరుద్ధరణ పనులను, తీసుకోవాల్సిన నివారణ చర్యలను సిఫారసు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఎన్డీఎస్ఏకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీఎస్ఏ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిరుడు మార్చిలో ప్రత్యేక నిపుణుల కమిటీని నియమించి, నాలుగు నెలల్లో నివేదికను అందజేయాలని ఆదేశించింది. సదరు కమిటీ గత ఏడాది మార్చి 6,7,8,9 తేదీల్లో, ఆ తరువాత 20,21,22 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించింది. స్వయంగా వెళ్లి మూడు బరాజ్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. నిర్మాణ ఏజెన్సీలతో, అందులో భాగస్వాములైన అధికారులతోనూ భేటీ అయ్యింది. బరాజ్‌లకు సంబంధించిన నిర్మాణ డిజైన్లు, తదితర డాక్యుమెంట్లను సైతం ఇరిగేషన్ అధికారులను అడిగి తీసుకున్నది.
తదతనంతరం వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా బరాజ్‌ల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై మధ్యంతర మార్గదర్శకాలను జారీచేసింది. కేంద్ర సంస్థలతో పలు సాంకేతిక పరీక్షలు చేయించాలని, ఆ నివేదికలు అందిన తరువాత పరిశీలించి తుది నివేదికను అందిస్తామని కూడా ఆ సందర్భంగానే వెల్లడించింది. కమిటీ సూచనల మేరకు ఇరిగేషన్‌శాఖ పలు పరీక్షలు చేయించింది. వీలైనంత త్వరగా సాంకేతిక పరీక్షల నివేదికలను అందజేయాలని, అప్పుడే నిపుణుల కమిటీ తుది నివేదికను అందిస్తుందని ఎన్డీఎస్ఏ చైర్మన్ రాష్ట్ర సాగునీటిపారుదలశాఖకు పలుమార్లు లేఖలు రాశారు. అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ తుది నివేదికను ఎన్డీఎస్ఏ చైర్మన్‌కు అందజేసినట్టు ఢిల్లీ వర్గాలు తెలిపాయి. ఎన్డీఎస్ఏ కూడా ఆ నివేదికను కేంద్రజలశక్తిశాఖ పరిశీలనకు పంపింది. అక్కడ పరిశీలన అనంతరం రాష్ట్ర ఇరిగేషన్‌శాఖకు పంపే అవకాశముందని అధికారవర్గాలు వెల్లడించాయి.