హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీమేరకు ప్రతీ సెలూన్ ఆధునికీకరణకు రూ.2 లక్షలను అందజేసేందుకు మంత్రి కేటీఆర్ అంగీకరించారని నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు నాయీబ్రాహ్మణుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నాయీ బ్రాహ్మణుల ఆత్మగౌరవం పెంపొందించే విధంగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నదని, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని కొనియాడారు. 250 యూనిట్ల ఉచిత కరెంటు, సబ్సిడీ రుణాలు, నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నదని గుర్తుచేశారు. తాజాగా సెలూన్ల ఆధునికీకరణకు సైతం ఆర్థిక సాయం అందిస్తామనడంపై హర్షం వ్యక్తం చేశారు.