హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో ఐఏఎస్‌లను బదిలీ చేసింది. జిల్లా కలెక్టర్లు, పలు శాఖల హెచ్‌వోడీలతో కలిపి ఒకేసారి 36 మంది ఐఏఎస్‌లకు స్థానచలనం కల్పించింది. వీరితోపాటు నలుగురు నాన్ క్యాడర్ అధికారులను కూడా బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు.
రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న నవీన్ మిట్టల్‌ను బదిలీ చేసింది. ఆయనను విద్యుత్తు శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఆయన స్థానంలో రెవెన్యూ శాఖ కార్యదర్శిగా లోకేశ్కుమార్ను నియమించింది. సీపీఆర్వోగా పనిచేస్తూ, ఇటీవల సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా నియమితుడైన అయోధ్యరెడ్డి స్థానంలో జీ మల్సూర్‌ను నియమించింది.
మీడియాతో ఎలాంటి సంబంధంలేని వ్యక్తిని సీపీఆర్వోగా నియమించడం విశేషం. ఏడు జిల్లాల కలెక్టర్లను బదిలీచేసిన ప్రభుత్వం వారి స్థానంలో కొత్త వారిని నియమించింది. వెయిటింగ్లో ఉన్న చిట్టెం లక్ష్మి, శివశంకర్ లోతెట్టికి పోస్టింగ్ ఇచ్చింది.