హైదరాబాద్, డిసెంబర్ 22(నమస్తే తెలంగాణ) : తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్లు నవీన్‌మిట్టల్, దాన కిశోర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగోన్నతి కల్పించింది. ఈ మేరకు సోమవారం సీఎస్ కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న నవీన్ మిట్టల్‌ను, కార్మిక, ఉపాధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న దాన కిశోర్‌ను అదే శాఖల్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీలుగా నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
2001 బ్యాచ్‌కు చెందిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులకు అదనపు డీజీపీ ర్యాంక్ ఉద్యోగోన్నతి కల్పిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎస్ పేరూల్స్ 2016 ప్రకారం లెవల్-15 పేమ్యాట్రిక్స్లో వీరికి ఉద్యోగోన్నతి లభించింది. ఉద్యోగోన్నతి పొందిన వారిలో అకున్‌సబర్వాల్, రాచకొండ క మిషనర్ సుధీర్‌బాబు ఉన్నారు. జనవరి 1 నుంచి వీళ్లు ఏడీజీలుగా కొనసాగుతారు.