పటాన్చెరు, ఏప్రిల్ 17: ప్లాస్టిక్.. ప్రస్తుతం ప్రపంచానికి సవాల్ విసురుతున్న రక్కసి. వేల ఏండ్లు గడిచినా భూమిలో కలిసిపోలేని ప్లాస్టిక్ వ్యర్థాలతో భూమి సహజత్వాన్ని కోల్పోతున్నది. అందులోనూ తిరిగి వినియోగించలేని ప్లాస్టిక్‌తో మరింత ప్రమాదం తరుముకొస్తున్నది. ఈ సమస్యకు ఇద్దరు యువ పారిశ్రామికవేత్తలు పరిష్కారాన్ని కనుక్కొన్నారు. క్యారీ బ్యాగులు, ప్యాకిం గ్, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణ హిత టైల్స్‌ను రూపొందించారు. ప్రకృతిలో కలిసిపోని ప్లాస్టిక్ వ్యర్థాలతో ఫుట్‌పాత్‌లపై పరిచే టైల్స్‌ను, పార్కింగ్‌లో వేసే బ్రిక్స్‌ను తయారు చేస్తున్నారు. ఇప్పటికే వీరు తయారుచేసిన టైల్స్, బ్రిక్స్‌ను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిజాంపేట్ మున్సిపాలిటీలో ఫుట్‌పాత్‌ల నిర్మాణానికి వినియోగించగా, మున్సిపాలిటీకి కేంద్ర స్వచ్ఛ సర్వేక్షణ్‌లో బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు వచ్చింది. అలాగే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ కార్పొరేషన్లలోనూ వీరు తయారుచేసిన ప్లాస్టిక్ టైల్స్‌తో ఫుట్‌పాత్‌లను నిర్మించారు. వీరిద్దరి పరిశోధనలకు ఈ ఏడాది బెస్ట్ ఇన్నోవేషన్ ప్రాజెక్టు అవార్డు దక్కింది.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి..
దేశంలో నిత్యం వేల టన్నుల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలు డంప్‌యార్డులకు తరలి వస్తున్నాయి. తిరిగి వినియోగించే అవకాశం లేకపోవడంతో చెత్త ఏరే కార్మికులు కూడా వీటిని ముట్టుకోరు. వీటిని నాశనం చేయలేం, తిరిగి వాడుకోలేం. ప్రకృతిలో సహజంగా కలిసేందుకు వేల ఏండ్లు కావాలి. ఈ సమస్యకు ‘అయస్య ఇకో’ పరిశ్రమ పరిష్కారం చూపింది. వ్యర్థాలను వినియోగించి వీరు స్కేర్, జిగ్‌జాగ్ నమూనాలో టైల్స్‌ను తయారుచేశారు. నెలకు 35 వేల చదరపు అడుగుల మేర టైల్స్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. త్వరలో లక్ష చదరపు అడుగుల ఉత్పత్తి కోసం కృషి చేస్తున్నారు.
బెస్ట్ ఇన్నోవేషన్ ప్రాజెక్టు అవార్డు
ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలో ఎగ్జిబిషన్ ఇండియా గ్రూప్, ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యం లో నిర్వహించిన స్మార్ట్ సిటీ ఎక్స్‌పోలో ‘అయస్య ఇకో’ పరిశ్రమ ప్లాస్టిక్ ఫుట్‌పాత్ టైల్స్‌ను ప్రదర్శించింది. వీరి ఉత్పత్తులు బెస్ట్ ఇన్నోవేషన్ ప్రాజెక్టుగా గుర్తింపు పొంద గా, ప్రేమ్బెహల్ ఎక్సలెంట్ అవార్డును అందుకొన్నారు. వీరి ఉత్పత్తులు వాడి ఫుట్‌పాత్‌లు వేస్తున్న నిజాంపేట్ బల్దియాకు కూడా బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు దక్కింది.
ఉద్యోగాలు వదిలి..
జనగామ జిల్లా ఖిలాషాపూర్‌కు చెందిన మంగు కోహల్, మహబూబాబాద్‌కు చెందిన వెనిగల్ల సంతోష్‌కుమార్ కుటుంబాలు దశాబ్దాల క్రితమే హైదరాబాద్‌లో స్థిరపడ్డాయి. కోహల్, సంతోష్‌కుమార్ బీటెక్‌లో క్లాస్మేట్స్. కోహల్ ఎంబీఏ చదివి ఎల్అండ్టీలో ప్లానింగ్ ఇంజినీర్‌గా విధులు నిర్వహించేవాడు. సంతోష్‌కుమార్ ఎంటెక్ పూర్తిచేసి హైదరాబాద్ మెట్రోలో ప్లానింగ్ ఇంజినీర్‌గా పనిచేశాడు. ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ ఇద్దరిలోనూ ఏదో అసంతృప్తి ఉండేది. ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ అంటే ఇష్టమున్న ఈ స్నేహితులు.. ప్లాస్టిక్ వ్యర్థాలకు కొత్తరూపు ఇవ్వాలని సంకల్పించారు. ఉద్యోగాలను వదిలిపెట్టి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రామేశ్వరంబండ గ్రామ పరిధిలో 2020లో ‘అయస్య ఇకో’ పరిశ్రమను నెలకొల్పారు. ఇండియన్ బిజినెస్ స్కూల్(ఐఎస్బీ) సాయంతో మూస పద్ధతికి భిన్నంగా ప్లాస్టిక్ వ్యర్థాలపై ప్రయోగాలు చేశారు. సింగిల్ యూజ్ క్యారీబ్యాగులు, ఇతర వ్యర్థాలతో టైల్స్ తయారీకి శ్రీకారం చుట్టారు.
కొత్త ఉత్పత్తులు తెస్తాం..
పర్యావరణానికి తీరని నష్టంచేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలకు ఒక రూపం ఇవ్వాలనే లక్ష్యం మాకు దారిచూపింది. ఆరు నెలలపాటు పరిశోధనలు చేశాం. తిరిగి వినియోగించలేని ప్లాస్టిక్‌తో ప్రస్తుతం రెండు రకాల టైల్స్‌ను ఉత్పత్తి చేస్తు న్నాం. మా ఉత్పత్తులను పలు బల్దియాలు వాడి సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మా ఉత్పత్తులు సిమెంట్ టైల్స్ కంటే రెట్టింపు దృఢమైనవి, మన్నికైనవి. అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుని 200 ఏండ్ల వరకు పాడవవు. ప్రోత్సా హం లభిస్తే మరిన్ని ఉత్పత్తులు తయారు చేస్తాం. పూలకుండీలు, అలంకరణ సామగ్రిని కూడా తయారు చేసేందుకు కృషిచేస్తున్నాం.
– కోహల్, అయస్య ఇకో పరిశ్రమ యజమాని
పర్యావరణ పరిరక్షణే ధ్యేయం
పర్యావరణ పరిరక్షణ కోణంలోనే ఉత్పత్తి ఉండాలనే లక్ష్యంతో మేము పరిశోధన చేశాం. మొదట్లో అనుభవం కోసం రీయూజ్డ్ ప్లాస్టిక్ ఉత్పత్తులు తయారుచేశాం. ఆ అనుభవమే పర్యావరణంలో శిథిలమవ్వని ప్లాస్టిక్‌ను వాడేందుకు ప్రేరణ ఇచ్చింది. టైల్స్ తయారీ కోసం చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. మిషనరినీ దగ్గరుండి తయారుచేసుకుని ఉత్పత్తి ప్రారంభించాం.
– సంతోష్‌కుమార్, అయస్య ఇకో పరిశ్రమ యజమాని