హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను రద్దు చేయాలని, పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో ఈ నెల 26న దేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం(ఎన్‌ఎంవోపీఎస్) సెక్రటరీ జనరల్, తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ వెల్లడించారు. ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన ఎన్‌ఎంవోపీఎస్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. యూపీఎస్, ఎన్పీఎస్కు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. సీపీఎస్ రద్దుపై జాతీయస్థాయి ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు డిసెంబర్ 15న ఢిల్లీలో ఎన్‌ఎంవోపీఎస్ జాతీయ కన్వెన్షన్ నిర్వహించనున్నట్టు తెలిపారు. మహారాష్ట్ర, హరియాణా, జమ్మూకశ్మీర్, ఝార్కండ్, ఢిల్లీ రాష్ర్టాల ఎన్నికల్లో ‘ఓట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం’ నినాదంతో ముందుకెళ్తామని స్పష్టంచేశారు. సమావేశంలో తెలంగాణ నుంచి కల్వల్ శ్రీకాంత్, నరేశ్‌గౌడ్ సహా 22 రాష్ర్టాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.