హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): జాతీయ స్థాయిలో విద్యుత్తు ప్రాజెక్టులు, సరఫరా, నిధుల వినియోగం, గ్రిడ్ క్రమశిక్షణ తదితర అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకొనే నేషనల్ పవర్ కమిటీ సమావేశం సోమవారం జరుగనున్నది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్మన్ నేతృత్వంలోని ఈ కమిటీ సమావేశంలో ప్రాంతీయ పవర్ కమిటీ (ఆర్పీసీ)ల చైర్మన్లతోపాటు ఎన్టీపీసీ, పీజీసీఎల్ చైర్మన్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. దక్షిణ ప్రాంత పవర్ కమిటీ చైర్మన్ హోదాలో తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు దక్షిణ ప్రాంతం నుంచి హాజరవనున్నారు. వర్చువల్ పద్ధతిలో జరిగే సమావేశంలో గతంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై ప్రాంతాలవారీగా విశదీకరిస్తారు.
దక్షిణ ప్రాంతంలో పవర్ ఐలాండ్స్ ఏర్పాటుతోపాటు ఎస్సార్పీసీలో చర్చించిన అంశాలు, వాటిపై వ్యక్తమైన అభిప్రాయాలను ప్రభాకర్‌రావు వివరించనున్నట్టు సమాచారం. వాటితోపాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణ పనులు, దక్షిణ ప్రాంతానికి వివిధ కేంద్ర సంస్థల నుంచి వచ్చిన నిధులు, వాటి ఖర్చు గురించి కూడా తెలియజేయనున్నారు. నేషనల్ ఎనర్జీ అకౌంటింగ్ వ్యవస్థ ఏర్పాటుపై దక్షిణ ప్రాంత పవర్ కమిటీ సమావేశంలో వెల్లడైన అభిప్రాయాన్ని తెలియజేసే అవకాశం ఉన్నది.