(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): ఖమ్మంలో జరగనున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ సభపై జాతీయ మీడియాల్లో విస్తృత చర్చ జరుగుతున్నది. ఈ సభ జాతీయ రాజకీయాలను ఏ మలుపు తిప్పనున్నది? అన్న కోణంలో జాతీయ స్థాయి రాజకీయ వర్గాల్లోనూ పెద్దఎత్తున చర్చ నడుస్తున్నది. ఆంగ్ల, హిందీ జాతీయ పత్రికలు, న్యూస్ వెబ్సైట్లు, సోషల్ మీడియా, న్యూస్ చానల్స్‌తో పాటు మలయాళం, పంజాబీ, కన్నడ, తెలుగు భాషలకు చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో వారం పది రోజులుగా ప్రత్యేక కథనాలు మార్మోగుతున్నాయి. ఉత్తరాది నుండి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (ఆప్), పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ (ఆప్), ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా, దక్షిణాది నుంచి కేరళ సీఎం పినరాయి విజయన్ (సీపీఎం)తో పాటు పలువురు జాతీయ నాయకులు, రైతు సంఘాల నాయకులు బీఆర్ఎస్ సభకు తరలి రానుండటంతో జాతీయ రాజకీయాలను ఈ సభ మలుపు తిప్పుతుందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతున్నది.