(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): చెంప పగలగొట్టాలనిపిస్తున్నదని, పొట్టకోస్తే అక్షరంముక్క కూడా రాదని జర్నలిస్టులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా పరిగణించే మీడియా ప్రతినిధులపై సీఎం హోదాలోని వ్యక్తి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడమేంటని జాతీయ స్థాయిలోనూ తీవ్రదుమారం నెలకొన్నది. రేవంత్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ప్రఖ్యాత టీవీ చానల్స్ ప్రత్యేక చర్చలు చేపట్టాయి. ఇంగ్లీష్ న్యూస్ చానల్స్ ఎన్డీటీవీ, టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీ, సియాసత్ టీవీ చానల్స్ రేవంత్ వైఖరిని తూర్పారబట్టాయి. జర్నలిస్టులపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం సరైనవి కాదంటూ చర్చలో పాల్గొన్న పలువురు నిపుణులు, రాజకీయ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలోని వ్యక్తి సంయమనంతో మాట్లాడాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రేవంత్ ఇకనుంచైనా అనుచిత వ్యాఖ్యలను మానుకోవాలని హితవు పలికారు.
అప్పుడు బట్టలూడదీసి కొడతానని..!
మార్చిలో జరిగిన శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ మాట్లాడుతూ జర్నలిస్టులపై తన అక్కసు వెళ్లగక్కారని డిబేట్ల సందర్భంగా వక్తలు గుర్తుచేశారు. ‘తోడ్కలు తీస్తా.. బట్టలు విప్పించి రోడ్డుపై తిప్పించి కొడతా’ అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారని ప్రస్తావించారు. ఇప్పుడు చెంప పగలగొట్టాలనిపిస్తున్నదని మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చర్చలలో పాల్గొన్న మండిపడ్డారు. ఈ క్రమంలో ప్రత్యేక డిబేట్‌ను నిర్వహించిన రిపబ్లిక్ టీవీ.. గతంలో అసెంబ్లీ సాక్షిగా జర్నలిస్టులపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ప్రత్యేకంగా ప్లే చేసింది. అప్పటికీ, ఇప్పటికీ ఆయన ధోరణిలో ఏ మాత్రం మార్పు రాలేదని, జర్నలిస్టులపై రేవంత్ అక్కసు వెళ్లగక్కుతున్నారని ‘రిపబ్లిక్ టీవీ’ చర్చలో పాల్గొన్న పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు.
రేవంత్ తన వ్యాఖ్యలతో జర్నలిస్టులను భయపెడుతున్నారని టైమ్స్ నౌ ఓ కథనంలో తూర్పారబట్టింది. రేవంత్ వ్యాఖ్యలు జర్నలిస్టుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, ఆయన వ్యాఖ్యలు క్షేత్రస్థాయిలో పెద్దఎత్తున దుమారానికి దారితీశాయని ఇంగ్లీష్ న్యూస్ వెబ్సైట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’, ‘ది న్యూస్ మినట్’, ‘ఎన్డీటీవీ వెబ్సైట్’, ‘టైమ్స్ నౌ వెబ్సైట్’, ‘ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్’ తదితర మాధ్యమాలు తమ కథనాల్లో వెల్లడించాయి. రేవంత్ వ్యాఖ్యలను జాతీయ మీడియా ఏకిపారేసిందని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన ధోరణిని మార్చుకోవాలని జర్నలిస్టులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
మరి మీ సంగతో!
సోషల్‌మీడియా జర్నలిస్ట్‌లు, జూనియర్ జర్నలిస్ట్‌లను ఉద్దేశించి.. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణవాదులు పెద్దఎత్తున విరుచుకుపడుతున్నారు. జూనియర్ జర్నలిస్ట్‌లు ముందువరుసలో కూర్చుంటే తప్పేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించి.. యాదాద్రి ఆలయంలో మల్లు భట్టివిక్రమార్క పీటపై కూర్చుంటే.. రేవంత్‌రెడ్డి కుర్చీపై కూర్చున్న ఫొటోలను షేర్ చేస్తున్నారు. గతంలో కేసీఆర్ పాలనపై, ఆయన కుటుంబంపై యూట్యూబ్ జర్నలిస్ట్‌ల పేరుతో.. అసత్య ప్రచారాలు, అసభ్య వ్యాఖ్యలతో రోజూ అడ్డగోలుగా మాట్లాడిన వాళ్లను అక్కున చేర్చుకుని.. పదవులు కట్టబెట్టిన రేవంత్‌రెడ్డికి.. ఇప్పుడు సోషల్‌మీడియా జర్నలిస్ట్‌లు అంటే మింగుడుపడటం లేదా..? అని నిలదీస్తున్నారు. జర్నలిస్ట్‌లు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే కూడా రేవంత్‌రెడ్డి ఓర్వలేకపోతున్నారని.. పుష్ప సినిమా క్లిప్పింగ్స్‌ను కొందరు షేర్ చేస్తున్నారు. మొత్తంగా రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీడియాలో నిపుణులు, సోషల్‌మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడినా బూమరాంగ్ అవుతున్నదంటూ కొందరు ఎద్దేవా చేస్తున్నారు.
రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చుతం: డిజిటల్ మీడియా జర్నలిస్టులు
చిక్కడపల్లి, ఆగస్టు 2: ప్రజల తరపున ప్రశ్నిస్తున్న తమను అణిచివేయాలని చూస్తే రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చుతామని డిజిటల్ మీడియా జర్నలిస్ట్‌లు హెచ్చరించారు. డిజిటల్ మీడియా వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనే విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. డిజిటల్ మీడియాపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేఖరుల సమావేశం నిర్వహించిన డిజిటల్ జర్నలిస్ట్‌లు శంకర్, రఘు, పృథ్విరాజ్, నాగేశ్, మహిపాల్‌యాదవ్, నిర్మల, మధు, దాసరి శ్రీనివాస్, ఆజాద్ తదితరులు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. తాము ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంటే.. రేవంత్‌రెడ్డి భయపడి, అసహనంతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రానున్న ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేసి, తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. సమావేశానికి నిరుద్యోగులు సంఘీభావం తెలిపారు. ఏ కోర్సూ చేయకుండా, ఏ అర్హత లేకుండా రేవంత్‌రెడ్డి సీఎం అయినప్పుడు.. డిజిటల్ జర్నలిస్ట్‌లు ఏం కోర్సు చేశారని ప్రశ్నించడమేంటని నిలదీశారు. రేవంత్ భాష అసహ్యంగా ఉందన్నారు.