ఫోన్ చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ
శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి, సీజేఐ,
కేంద్రమంత్రులు, గవర్నర్లు, సీఎంలు, ప్రముఖులు
ఢిల్లీ, ముంబైలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు
పలు రాష్ర్టాల్లో ఫ్లెక్సీలు పెట్టిన కేసీఆర్ అభిమానులు
హైదరాబాద్, ఫిబ్రవరి 17 : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా పలువురు గవర్నర్లు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు, ఇతర ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు పూలబోకేను పంపించారు.
ఆయురారోగ్యాలతో ఉండాలి
మీకు జన్మదిన శుభాకాంక్షలు. జీవితాంతం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.
– రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి
మీ జీవితం కీర్తిమయం కావాలి
మీకు హార్థిక జన్మదినోత్సవ శుభాకాంక్షలు. భగవంతుడు మీకు దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. సమాజహితం కోసం మీరు చేపట్టే కార్యక్రమాల ద్వారా మీ జీవితం కీర్తిమయం, సార్థకం కావాలని ఆకాంక్షిస్తున్నాను. -వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి
పుట్టినరోజు శుభాకాంక్షలు
మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. చిరకాలం సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను. -జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీం ప్రధాన న్యాయమూర్తి
చిరకాలం ఆరోగ్యంగా ఉండాలి
మీకు జన్మదిన శుభాకాంక్షలు. చిరకాలం ఆయురారోగ్యాలతో జీవించాలి. – నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
రాష్ర్టాల గౌరవాన్ని కాపాడుకుందాం..
మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. రాష్ట్రాల హక్కులు, ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి కోసం పట్టుదలతో పోరాడుతున్న నాయకుడు మీరు. మనమందరం సహకార సమాఖ్య వాదాన్ని, రాజ్యాంగం కల్పించిన రాష్ట్రాల గౌరవాన్ని కాపాడేందుకు కృషిచేద్దాం. – స్టాలిన్, తమిళనాడు సీఎం
సుఖసంతోషాలతో చిరకాలం జీవించాలి
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో చిరకాలం జీవించాలి. –పినరాయి విజయన్, కేరళ సీఎం
దేవుడు దీవించాలి
సీఎం కేసీఆర్‌కు హార్థిక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మిమ్మల్ని ఆయురారోగ్యాలతో జీవించాలని దీవించాలి. -వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఏపీ సీఎం
కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, నితిన్ గడ్కరీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, తెలంగాణ మాజీ గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్, వైసీపీ ఎమ్మెల్యే సినీనటి రోజా, సినీనటుడు నితిన్, బీజేపీ నేత రాపోలు ఆనంద భాస్కర్ సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ నేత నారాలోకేశ్ ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఢిల్లీ, ముంబైలో పుట్టినరోజు వేడుకలు
బంజారాహిల్స్, ఫిబ్రవరి 17: దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై నగరాల్లో స్థిరపడిన తెలంగాణవాసులు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద టీఆర్ఎస్ అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. స్థానిక సాయిబాబా ఆలయంలో పూజలు చేసి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ముంబై శివారు నాగపడ ప్రాంతంలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జావెద్ జునేజా, సామాజిక కార్యకర్తలు శంకర్, నరసయ్య బిట్ల, దొంతుల్ బాలనర్సయ్య, చంద్రకాంత్, మారుతీ కుంచల్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీ, యూపీలో భారీ హోర్డింగ్‌లు
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు మద్దతు పలుకుతూ ఏపీ, యూపీ రాష్ర్టాల్లో భారీ హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. ఏపీలోని వైజాగ్, ఒంగోలులో పెద్ద హోర్డింగ్‌లు పెట్టారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం తిరుపతిలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కడియంలోని నర్సరీలో మొక్కలు, కూరగాయలు, పువ్వులతో కేసీఆర్ చిత్రపటాన్ని ప్రదర్శించారు. ‘హ్యాపీ బర్త్‌డే కేసీఆర్ సర్’ అని రాసి అభిమానాన్ని చాటుకున్నారు. మోదీ సొంత నియోకవర్గం యూపీలోని వారణాసిలోనూ భారీ హోర్డింగ్‌లు వెలిశాయి. మృత్యుంజయ మిశ్రా అనే కేసీఆర్ యువ అభిమాని సీఎంను ‘దేశ్ కీ నేతా’ అని సంభోదిస్తూ చౌక్ఘాట్, ఫతేమన్ రోడ్డు, రథయాత్ర వంటి ప్రధాన కూడళ్లలో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. వారణాసికి చెందిన మృత్యుంజయ మిశ్రా తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్‌లో చదువుకొన్నారు. సీఎం కేసీఆర్‌కు అభిమానిగా మారారు. ప్రస్తుతం వారణాసిలో స్థిరపడ్డా.. అభిమానాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఏటా సీఎం కేసీఆర్ పుట్టినరోజున ఫ్లెక్సీలు కడుతున్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జీపై కట్టిన ఒక ఫ్లెక్సీలో సీఎం కేసీఆర్‌ను ‘బంగారు తెలంగాణ సాధకుడు’, ‘తెలంగాణ సాయి’ అని కీర్తించారు.