Machhu Dam | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): అది 1979వ సంవత్సరం. భారీ వర్షాలతో గుజరాత్‌లోని మోర్బీ జిల్లా అతలాకుతలమైంది. మచ్చు నదికి వరద పోటెత్తింది. దీంతో మచ్చు డ్యామ్ తెగిపోయింది. ప్రాజెక్టు కిందనున్న ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి. వరద నీటిలో ఎక్కడ చూసినా తేలుతున్న మృతదేహాలే. మొత్తంగా 25 వేల మంది మరణించారు. దేశంలోనే అత్యంత భయానక దుర్ఘటన అంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థ కూడా అభివర్ణించింది. దుర్ఘటన జరిగి 44 ఏండ్లు గడిచింది. అయితే, మచ్చు డ్యామ్ దుర్ఘటనపై సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)గానీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)గానీ ఇప్పటివరకూ ఎలాంటి సమగ్ర నివేదిక సమర్పించలేదు. అంతవరకు ఎందుకు? కిందటి నెలలోనే సిక్కింలో కురిసిన భారీ వర్షాలకు చుంగ్తంగ్ హైడల్ ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. మొత్తంగా 175 మంది మృత్యువాతపడ్డారు. కోట్ల ఆస్తినష్టం సంభవించింది. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా ప్రభుత్వం నివేదికను విడుదల చేయలేదు. మచ్చు డ్యామ్ తెగిపోయి.. 25 వేల మంది మరణిస్తే నివేదిక లేదు. దర్యాప్తు అసలే లేదు. 2021లో డ్యామ్ సేఫ్టీ చట్టం అమల్లోకి వచ్చినా.. నిన్నటికి నిన్న.. సిక్కింలో హైడల్ ప్రాజెక్ట్ కొట్టుకుపోయి 175 మంది మరణించినా ప్రమాదానికి గల కారణాలపై ఇంకా నివేదిక బయటకు రాదు. కానీ, తెలంగాణ జలధార కాళేశ్వరం ప్రాజెక్టుపై మాత్రం కేవలం వారంలోనే అసంబద్ధమైన ఓ నివేదిక బయటకు వచ్చింది. దీన్ని బట్టి తెలంగాణ, కాళేశ్వరంపై కేంద్రం ఎంతటి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదో అర్థంచేసుకోవచ్చు.
కేరళలోని అత్యంత పురాతన డ్యామ్‌లలో ముల్లపెరియార్ ఒకటి. 2010లో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు డ్యామ్ భద్రతపై ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయి. అయినప్పటికీ, సీడబ్ల్యూసీ, ఎన్డీఎస్ఏ అధికారులు పట్టించుకోలేదు. దీంతో స్పందించిన సుప్రీంకోర్టు డ్యామ్‌ను సందర్శించి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయితే, భేటీలమీద భేటీలు నిర్వహించిన కమిటీ సభ్యులు రెండేండ్ల తర్వాత నివేదికను సమర్పించారు. 2018లో కేరళలో వరద బీభ త్సం సృష్టించింది. మళ్లీ ముల్లపెరియార్ డ్యాం భద్రతపై ఆందోళన వ్యక్తమయ్యింది. వెంటనే నివేదిక ఇవ్వాలని అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది. 14 సమావేశాలను నిర్వహించిన సీడబ్ల్యూసీ సభ్యులు మూడేండ్ల తర్వాత అంటే 2021లో రిపోర్ట్ ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లోని కారమ్ నది మీద నిర్మిస్తున్న ధార్ డ్యామ్ గోడల్లో కిందటేడాది పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని అక్కడి గ్రామస్తులు తొలుత గుర్తించారు. రెండ్రోజుల్లోనే పగుళ్లు ఏర్పడిన కొంత భాగం కూలిపోయింది. దీంతో ప్రభుత్వం గంటల వ్యవధిలో 18 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాం తానికి తరలించింది. పగుళ్లకు కారణాలేంటో ఇప్పటివరకూ పూర్తి నివేదిక బయటకురాలేదు. మిగతా డ్యామ్‌లకు సంబంధించి నివేదికల సమర్పణకు ఏండ్లకు ఏండ్లు సమ యం తీసుకొంటూ, కొన్ని సందర్భాల్లో అసలు నివేదికలనే విడుదల చేయని కేం ద్రం.. కాళేశ్వరం ప్రాజెక్టుపై వారం వ్యవధిలోనే అత్యుత్సాహంతో ఓ అసంబద్ధ నివేదిక విడుదల చేయడం విమర్శలకు దారితీస్తున్నది.
ఉత్తరాఖండ్‌లో 2021లో సంభవించిన భారీ వరదలకు రిషిగంగా నదిపై నిర్మించిన 13.2 మెగావాట్ల హైడల్ ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయింది. దుర్ఘటన జరిగిన 15 రోజుల తర్వాత స్పందించిన సీడబ్ల్యూసీ కమిటీ సభ్యులు.. ప్రాజెక్టు ప్రాం తంలో పర్యటించకుండానే.. ఆరు నెలల తర్వాత నివేదికను సమర్పించారు. ఇది అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది.