హైదారాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ఆలిండియా బంజారా ప్రతినిధుల జాతీయ సదస్సు నేడు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సంత్ సేవాలాల్ బంజారా భవన్లో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ర్టాల నుంచి గిరిజన మేధావులు హాజరుకానున్నట్టు నిర్వాహకులు రూప్సింగ్, నాయక్ సింపల్ రాథోడ్, రాంబల్ నాయక్ తెలిపారు. మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ సదస్సును ప్రారంభిస్తారు. నిర్వాహకులు మాట్లాడుతూ తెలంగాణ మాడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నదే తమ డిమాండ్ అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తమ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచినట్టు తెలిపారు. బంజారాలకు దేశవ్యాప్తంగా ఒకే రిజర్వేషన్ అమలు చేయ డం, లంబాడా భాషను 8వ షెడ్యూల్లో చేర్చడం, ఒకప్పుడు ఢిల్లీని పాలించిన లకిసా బంజారా కాంస్య విగ్రహాన్ని పార్లమెంటులో ప్రతిష్ఠించడం వంటి అంశాలపై సదస్సులో ప్రతినిధులు చర్చిస్తారు.