హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఆగ్రహం వ్యక్తంచేసింది. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని, అన్ని గురుకులాల్లో వార్డెన్లను, కౌన్సెలర్లను నియమించాలని స్పష్టంచేసింది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణవ్యాప్తంగా గురుకులాల్లో గత ఏడాదిన్నర కాలంలోనే అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అందుకు ప్రధాన కార ణం గురుకులాల్లో అమలు చేస్తున్న టైం టేబులేనని రాష్ర్టానికి చెందిన ఒకరు ఎన్సీపీసీఆర్కు ఫిర్యాదు చేశారు. అవిశ్రాంతమైన టైంటేబుల్ మూలంగా విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఫలితంగానే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆ ఫిర్యాదులో వెల్లడించారు.
మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ప్రతీ గురుకులంలో కౌన్సెలర్‌ను నియమించాలని, అదేవిధంగా పర్యవేక్షణ కోసం వార్డెన్లను నియమించేలా చూడాలని ఎన్సీపీసీఆర్కు ఆ ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. గురుకులాల్లో చోటుచేసుకున్న విద్యార్థుల ఆత్మహత్యలు, తదితర అంశాలకు సంబంధించిన ఆధారాలను కమిషన్‌కు అందజేశారు. ఆయా అంశాలను పరిశీలించిన నేషనల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ తాజాగా స్పందించింది. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు అన్ని గురుకులాల్లో కౌన్సెలర్లను, వార్డెన్లను నియమించాలని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించింది.