హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు జాతీయ అవార్డులు క్యూ కడుతున్నాయి. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, పట్టణాలు ఇప్పటికే పలు జాతీయ అవార్డులు అందుకోగా, తాజాగా కేంద్ర జల్‌శక్తి శాఖ ప్రకటించిన నాలుగో జాతీయ జల అవార్డుల్లో రాష్ర్టానికి మూడు పురస్కారాలు దక్కాయి. ఉత్తమ నీటి విధానాలను అవలంబించడంతోపాటు ప్రజల్లో అవగాహన కల్పించినందుకుగాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం జాతీయస్థాయిలో ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. మొత్తం 11 విభాగాల్లో 41 అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఉత్తమ రాష్ట్రంగా మధ్యప్రదేశ్, ఉత్తమ జిల్లాగా ఒడిశాలోని గంజాం ఎంపికైంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం ఉత్తమ గ్రామ పంచాయతీగా సత్తా చాటింది. ఉత్తమ జిల్లాల క్యాటగిరీలో ఆదిలాబాద్ మూడో స్థానంలో నిలిచింది. ఉత్తమ సంస్థల విభాగంలో హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం రెండోస్థానం దక్కించుకొన్నది. ఈ నెల 17న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరుగనున్న కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయనున్నారు. ప్రశంసా పత్రం, ట్రోఫీతోపాటు నగదు బహుమతి అందజేయనున్నారు. జల వనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ అధ్వర్యంలో 2018 నుంచి జల, నీటి వనరుల నిర్వహణ అవార్డులను అందజేస్తున్నారు.
జల సంపన్న భారత్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ప్రకటిస్తున్నారు. కాగా, తెలంగాణ జాతీయస్థాయిలో ఉత్తమంగా నిలువడంపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో అమలు చేస్తున్న పల్లె ప్రగతివంటి కార్యక్రమాలతో తెలంగాణను జాతీయస్థాయి అవార్డులు వరిస్తున్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞలు తెలిపారు. అవార్డుకు ఎంపికైన జగన్నాథపురం గ్రామ పంచాయతీకి, పాలకవర్గం, సిబ్బంది, అధికారులకు శుభాకాంక్షలు చెప్పారు.