Narsampeta | చెన్నారావుపేట, డిసెంబర్ 31: కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత గ్రామంలో అదే పార్టీ నేతలకు పరాభవం ఎదురైంది. ఆ పార్టీ వైఖరిపై తండావాసులంతా ఏకమై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తమ సమ్మతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న వైఖరిని తప్పుబట్టిన ఆ ఊరి జనం కాంగ్రెస్ నేతలను ఊరి నుంచే తరిమేశారు. అధికారుల ఎదుట తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. నినాదాలతో తమ డిమాండ్‌ను ఏకరువు పెట్టారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని పత్తినాయక్ తండా గ్రామ పంచాయతీగా గతంలోనే ఏర్పాటైంది.
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన సొంత గ్రామమైన అమీనాబాద్‌లో పత్తినాయక్ తండాను బలవంతంగా విలీనం చేసే యత్నాన్ని తండావాసులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రశాంతంగా ఉన్న పచ్చని గ్రామాల్లో విలీనం పేరుతో ఎమ్మెల్యే చిచ్చు పెట్టడాన్ని గ్రామస్థులు, తండావాసులు వ్యతిరేకిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తినాయక్ తండాను అమీనాబాద్ గ్రామంలో కలిపి మేజర్ గ్రామ పంచాయతీగా చేయాలని ఎమ్మెల్యే మాధవరెడ్డి ఆసక్తి కనబర్చడం మూర్ఖత్వమని ప్రజలు బహిరంగంగానే వ్యతిరేకించారు. ఈ మేరకు పత్తినాయక్‌తండా, బాపూనగర్ గ్రామాల్లో విలీనంపై చర్చ నిమిత్తం మంగళవారం అధికారులు గ్రామసభలు నిర్వహించారు. మండలస్థాయి అధికారులు లేకుండానే కార్యదర్శి, ప్రత్యేక అధికారులతో గ్రామసభలు నిర్వహించడాన్ని తండావాసులు వ్యతిరేకించారు. అమీనాబాద్‌లో బాపునగర్, పత్తినాయక్ తండా విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయా సభల్లో తీర్మానించారు.
గుడి అభివృద్ధి పేరిట గ్రామసభ
పత్తినాయక్‌తండా గ్రామసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ సభలో అధికారులతోపాటు నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ పాల్గొనడంపై తండావాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. తమ తండాలో ఎమ్మెల్యే ప్రత్యేక నిధులతో దుర్గమ్మ గుడి అభివృద్ధి చేస్తారని, దానిపై చర్చించడానికే గ్రామసభ ఏర్పాటు చేస్తున్నామని తెలిపి సంతకాలు సేకరించారని తండావాసులు ధ్వజమెత్తారు. తండాల విలీనం కోసమే గ్రామసభ ఏర్పాటు చేశారని తమకు తెలియదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులతో బలవంతంగా గ్రామసభ నిర్వహించి అనుకూలంగా సంతకాలు సేకరించాలని చూడటంతో గ్రామస్థులు తిరగబడ్డారు. దీంతో చేసేదేమీ లేక పోలీసులు ఇతర గ్రామాల నాయకులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. గ్రామస్థులు కాకుండా కాంగ్రెస్ నాయకులు పాల్గొనడంతో ఆగ్రహించిన తండావాసులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
‘మా తండా మాకే కావాలి’, ‘మా తండాలో మా రాజ్యం కావాలి’ అంటూ పత్తినాయక్ తండా ఊరు ఊరంతా చేసిన నినాదాలు హోరెత్తాయి. మా ఊరి గ్రామసభలో వేరే ఊరి కాంగ్రెస్ నాయకులకేం పని, వారంతా ఊరిడిచి వెళ్లాలి.. అంటూ ఆందోళనకు దిగారు. గ్రామస్థుల ఆగ్రహాన్ని చూసిన కాంగ్రెస్ నాయకులు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. అనంతరం గ్రామంలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నంచేశారు. పరిస్థితిని గమనించిన అధికారులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ‘మా ఊరి నాయకుడే ఎమ్మెల్యే అయితడని ఓ ట్లేసి గెలిపిస్తే మా మధ్యే చిచ్చు పెడుతున్నాడు’ అని మాధవరెడ్డిపై తండావాసులు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. సొంత గ్రామంపై ప్రేమ ఉంటే అభివృద్ధి చేయాలే తప్ప ప్రజల మధ్య గొ డవలు పెట్టొద్దని హితవు పలికారు.

గిరిజనుల స్వయంపాలనకు కాంగ్రెస్ తూట్లు: పెద్ది
గిరిజనుల స్వయం పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తూట్లు పొడుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మండలంలోని బాపూనగర్, పత్తినాయక్ తండాల్లో జరిగిన ఘటనలను ఆయన తీవ్రంగా ఖండించారు. తండాలు ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తితో బతకాలనే ఉద్దేశంతో నాడు కేసీఆర్ వాటి ని గ్రామ పంచాయతీలుగా చేశారని, అందులో భాగంగానే నర్సంపేట నియోజకవర్గంలో 76 తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటయ్యాయని చెప్పా రు. ఎమ్మెల్యే దొంతి దౌర్జన్యంగా పత్తినాయక్తండాను సొంత గ్రామమైన అమీనాబాద్‌లో కలపాలనుకోవడం తండావాసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ధ్వజమెత్తారు. తండావాసుల అభిప్రాయా న్ని పరిగణనలోకి తీసుకోకుండా బయటి వా రిని తీసుకొచ్చి దౌర్జన్యం చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. గ్రామసభ అనేది గ్రామస్థులు, అధికారుల సమక్షంలో జరగాలని, గిరిజనేతరులు, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో కాదని చెప్పారు. పోలీసులను అడ్డుపెట్టుకొని గ్రామస్థుల సమ్మతి లేకుండా గ్రామసభ నిర్వహించడం మూర్ఖత్వమని పేర్కొన్నారు. సొంత గ్రామంలోనే ప్రజలు తిరగబడే స్థితికి ఎమ్మెల్యే దిగజారాడని, ఎమ్మెల్యే మాధవరెడ్డి ఇప్పటికైనా విలీన ప్రక్రియను విరమించుకోవాలని పెద్ది సుదర్శన్‌రెడ్డి సూచించారు.
దుర్గమ్మ గుడి కోసమంటే వచ్చాం
తండాలో దుర్గమ్మ గుడి అభివృద్ధి కోసం నిధులు కావాలని మీ రు సంతకాలు చేస్తే ఎమ్మెల్యే మాధవరెడ్డితో మాట్లాడుతామని చెప్పడంతో తెల్ల పేపర్‌పై సంతకాలు చేశాం. కా నీ, తండాను అమీనాబాద్‌లో విలీ నం చేస్తామంటే అసలు ఒప్పుకోం. వారు చెప్పింది ఒకటి.. ఇక్కడ చేసేది మరొకటి. తండాను అమీనాబాద్ గ్రామంలో విలీనం చేయడం కోసమే సంతకాలు సేకరించారని, గ్రామసభ ఏర్పాటు చేశారనే విషయం మాకు తెలియదు.
– బానోత్ వీరస్వామి, తండా వాసి