వరంగల్, నవంబర్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మరోసారి సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు దూరంగా ఉన్నారు. మంగళవారం వరంగల్‌లో నిర్వహించిన ‘ఇందిరా మహిళాశక్తి-ప్రజాపాలన విజయోత్సవాలు’ కార్యక్రమానికి దొంతి మాధవరెడ్డి వరంగల్‌లోనే ఉండి కూడా హాజరు కాలేదు. మంత్రి పదవుల కేటాయింపులో పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇచ్చారని ఆయన అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. రేవంత్ ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి దొంతి మాధవరెడ్డి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆయనను కలవలేదు. రేవంత్‌రెడ్డి వరంగల్ ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా మాధవరెడ్డి దూరంగానే ఉంటున్నారు.
ఈ ఏడాది జూన్‌లో సీఎం వరంగల్ పర్యటనకు రాగా, మాధవరెడ్డి నగరంలోనే ఉన్నా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఆ తర్వాత భారీ వర్షాలతో నష్టం జరిగిన మహబూబాబాద్ జిల్లాలో రేవంత్‌రెడ్డి పర్యటించారు. వానల కారణంగా హెలికాప్టర్ ప్రయాణం వీలుకాకపోవడంతో రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు వెళ్లారు. నర్సంపేటలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముందు నుంచే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు వెళ్లారు. నర్సంపేటలోనే ఉన్న ఎమ్మెల్యే మాధవరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్‌కు కనీసం స్వాగతం కూడా పలకలేదు.
టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పు డు మాధవరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య దూరం కొనసాగుతున్నది. రాహుల్ జోడోయాత్ర సమయంలో పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ‘హాత్ సే హాత్ జోడో’ పేరుతో యాత్ర చేపట్టారు. మహబూబాబాద్ లోక్‌సభ సెగ్మెంట్లోని మేడారంలో రేవంత్‌రెడ్డి ఈ యాత్ర మొదలుపెట్టారు. ములుగు తర్వాత నర్సంపేట నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి యాత్ర నిర్వహించేలా రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. అయితే, నర్సంపేట సెగ్మెంట్లో ఆ కార్యక్రమం వద్దని రేవంత్‌రెడ్డికి దొంతి మాధవరెడ్డి స్పష్టంచేశారు. దీంతో రేవంత్ యాత్రలో నర్సంపేటను మినహాయించారు.