హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ జనరల్ సందీప్‌శాండిల్య శుక్రవారం పదవీ విరమణ పొందారు. హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లోని తన చాంబర్లో టీఎస్ న్యాబ్ సిబ్బంది ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా సందీప్‌శాండిల్య సేవలను, వృత్తిలో ఆయన పాటించిన నిబద్ధత, నిజాయితీని కొనియాడారు. ఢిల్లీకి చెందిన సందీప్ శాండిల్య.. 1993 ఐపీఎస్ బ్యాచ్ ఆఫీసర్. మొదట గుంటూరులో, ఆ తర్వాత నల్లగొండ, ఆదిలాబాద్, కృష్ణా, సౌత్ జోన్ డీసీపీగా పనిచేశారు. సీఐడీ, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో, అడిషనల్ పోలీస్ కమిషనర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో సేవలందించారు. 2016 నుంచి 2018 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. రైల్వే అండ్ రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీగా కూడా పనిచేశారు. జైళ్లశాఖ డీజీగా మూడు నెలలపాటు పనిచేసిన సందీప్ శాండిల్య.. పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా, హైదరాబాద్ సీపీగా విధులు నిర్వహించారు. ముక్కుసూటితనం కలిగిన అధికారిగా పేరున్న సందీప్‌శాండిల్యను కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరోకు డైరెక్టర్‌గా నియమించింది. ఇటీవల డీజీపీ ర్యాంకుతో పదోన్నతి పొందిన సందీప్‌శాండిల్య.. శుక్రవారం పదవీ విరమణ పొందారు. ఈ నేపథ్యంలో టీఎస్‌న్యాబ్ ఇన్చార్జి డైరెక్టర్‌గా హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అయితే, డీజీ సందీప్ శాండిల్య నిబద్ధత, నిజాయితీని దృష్టిలో ఉంచుకొని టీఎస్‌న్యాబ్ డైరెక్టర్‌గా ఆయననే రెండేండ్లపాటు కొనసాగించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ మేరకు ఉత్తర్వులు వెలువడనున్నాయి.