ఊటూర్/మక్తల్, ఆగస్టు 13 : నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టు భూనిర్వాసితులు కదం తొక్కారు. బుధవారం నారాయణపేట జిల్లా ఎడవెల్లి నుంచి చిన్నపొర్ల , పెద్దపొర్ల గ్రామాల మీదుగా ఊట్కూరు మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల మేర నిర్వాసితులు పాదయాత్ర చేపట్టారు. స్థానిక చెక్‌పోస్టు నుంచి మండల కేంద్రంలో ఎడ్లబండ్లతో ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని దిగ్బంధించారు.
మరో లగచర్లను తలపించక ముందే సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి భూనిర్వాసితుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే కలెక్టరేట్‌తోపాటు అసెంబ్లీని సైతం ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. నిర్వాసితుల ఆందోళనలకు పార్టీలకతీతంగా నాయకులు మద్దతు తెలిపారు. ఎకరాకు రూ.60 లక్షల పరిహారం అందించడంతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.
కాగా మక్తల్ మండలం కాచ్వార్‌లో తహసీల్దార్ సతీశ్‌కుమార్, ఎస్సై భాగ్యలక్ష్మిరెడ్డి కొడంగల్ లిఫ్ట్ భూనిర్వాసితులతో బుధవారం సమావేశమయ్యారు. ఎకరాకు రూ.14 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రభుత్వం నిర్ణయించిందని, రైతులు సంతకాలు చేస్తే రెండు, మూడ్రోజుల్లో ఖాతాల్లో డబ్బులు జమవుతాయని తెలిపారు. ఇందుకు రైతులెవరూ ఒప్పుకోలేదు. ఎకరాకు రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు పరిహారం అందిస్తేనే సంతకాలు చేస్తామని తెగేసి చెప్పారు.