Narayanapet | మక్తల్, జూన్ 12 : మక్తల్ మండల పరిధిలోని బొందలకుంట గ్రామ స్టేజి సమీపంలో జాతీయ రహదారి 167పై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాద ఘటనాస్థలాన్ని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతం గురువారం ఉదయం పరిశీలించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించి వారిని సురక్షితంగా వారు వీళ్లకు చేరుకునే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని నిశితంగా పరిశీలించారు.
అనంతరం ఎస్పీ యోగేష్ గౌతం విలేకరులతో మాట్లాడుతూ మక్తల్ మండలం బొందలకుంట గ్రామ స్టేజి వద్ద తెల్లవారుజామున 165 జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుండి వచ్చిన వోల్వో బస్సు ఢీకొనడం వల్ల, అందులో ప్రయాణిస్తున్నటువంటి 18 మంది ప్రయాణికులకు గాయాలు కావడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని నిశితంగా పరిశీలించడం జరిగిందని పేర్కొన్నారు. బొందలకుంట గ్రామ స్టేజీ సమీపంలో జాతీయ రహదారి 167పై హైదరాబాద్ వైపు వెళ్తున్నటువంటి లారీ రిపేరు నిమిత్తం రోడ్డు పై ఆగి ఉన్నందువల్ల, జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు లారీని గమనించి అక్కడ కోన్స్ అడ్డుగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ నుండి ప్రయాణికులను తీసుకొని హైదరాబాద్ వైపు వెళ్తున్నటువంటి వోల్వో బస్సు డ్రైవర్ వేగంగా నిర్లక్ష్యంతో డ్రైవ్ చేయడం వల్ల జాతీయ రహదారిపై యాగి ఉన్న లారీని వెనుక భాగంలో ఈ కొట్టడం వల్ల ప్రమాదం సంభవించిందన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించారన్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు రెండు కాళ్లు విరగడంతో పాటు మరొక ఐదు మందికి కాళ్లు ఫ్యాక్చర్స్ కావడం జరిగిందన్నారు. మిగతా వారికి స్వల్ప గాయాలు కావడం జరిగిందని ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులందరికీ మెరుగైన చికిత్స అందించాలని వారిని రాయచూర్, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రాల ఆసుపత్రులకు తరలించడం జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు.
నారాయణపేట జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి, ఎక్కడికక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి అక్కడ సైన్ బోర్డ్స్, స్పీడ్ బ్రేకర్లు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. పోలీస్ శాఖ తరపున జాతీయ రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని సూచించారు. అనుకోకుండా అక్కడక్కడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని పూర్తిస్థాయిలో నివారించడానికి తగిన చర్యలు త్వరలోనే తీసుకు రావడం జరుగుతుందన్నారు.
నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలం పెద్ద చింతకుంట నుండి కృష్ణ బ్రిడ్జి వరకు నిరంతరం హైవే పెట్రోలింగ్ జరుగుతూనే ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. జాతీయ రహదారిపై ఏదైనా సాంకేతిక లోపంతో వాహనాలు ఆగితే హైవే పెట్రోలింగ్ పోలీసులు అట్టి వాహనాలను సైడ్‌కు జరిపి నిలిపే విధంగా చర్యలు చేపడుతున్నారని సూచించారు. పెద్ద చింతకుంట, దండు క్రాస్ రోడ్, తోపాటు తదితర ప్రాంతాలలో ప్రమాదాలు జరిగే స్థలాలను పరిశీలించడం జరిగిందని సూచించారు. జాతీయ రహదారిపై ప్రయాణం చేసే వాహనదారులు సాధ్యమైనంత వరకు రోడ్డుపై వాహనాలను నిలుపుకోరాదని సూచించారు. అత్యవసర సమయంలో వాహనాలకు రిపేర్ అయి రోడ్డుపై నిలబడితే తగిన సూచికలను ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నివారించే చర్యలు చేపట్టాలని అధికారులకు ఎస్పీ ఆదేశించారు. ఎస్పీ వెంబడి మక్తల్ సీఐ రాంలాల్, ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి సిబ్బంది తదితరులు ఉన్నారు.