హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ‘మధ్య భారతదేశంలోని అడవిని చుట్టుముట్టిన 30 వేల భద్రతా బలగాలను వెనక్కి రప్పించాలి.. ఆదివాసీల జీవించే హకుకు రక్షణ కల్పించాలి.. సైనిక క్యాంపులను ఎత్తివేసి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి’ అని కేంద్ర ప్రభుత్వాన్ని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఇటు మావోయిస్టులు, ఆదివాసీ బిడ్డల ప్రాణాలు.. అటు భద్రతా బలగాల ప్రాణాలు నష్టపోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చర్చలు జరపాలని కోరారు. ఈ ఏడాది మేలో కర్రెగుట్టల్లో 22 మంది మావోయిస్టులను హతమార్చారని, ఆపరేషన్ కగార్తో ఇప్పటికే 57 ఎన్కౌంటర్లలో 580 మంది హత్య గావించబడ్డారని అవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. మావోయిస్టు పార్టీ చర్చలకు సిద్ధమని చెప్పినా హత్యలు చేయడాన్ని పౌరసమాజం ఖండించాలని పేర్కొన్నారు.