హైదరాబాద్, జూలై 31(నమస్తే తెలంగాణ): బనకచర్ల ప్రాజెక్టు అనుమతులపై ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బనకచర్లకు అనుమతులు ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు.. ఆ సత్తా టీడీపీకి ఉన్నది’ అని పేర్కొన్నారు. గురువారం ఏపీలో మీడియాతో మాట్లాడిన మంత్రి లోకేశ్.. తన తండ్రి చంద్రబాబు మాటల్నే మళ్లీ వల్లెవేశారు.
మిగులు జలాలు, వరద జలాలనే బనకచర్లకు వినియోగించుకుంటున్నామంటూ చంద్రబాబు చెప్పిన మాటల్నే మంత్రి లోకేశ్ కూడా చెప్పుకొచ్చారు. ‘కాళేశ్వరానికి పొక్కగొట్టి నీళ్లు తీసుకోవడం లేదు కదా’ అంటూ అక్కసు వెళ్లగక్కారు. బనకచర్లకు సీడబ్ల్యూసీ అభ్యంతరం చెప్పడం, అనుమతుల గురించి మీడియా ప్రశ్నించగా లోకేశ్ స్పందిస్తూ.. ‘సీడబ్ల్యూసీకి సమాధా నం చెప్పుకొంటాం. ఐ విల్ గెట్ మై క్లియరెన్స్.. నో డౌట్ ఏబౌట్ ఇట్.. విశాఖ ఉక్కు నే రెండుసార్లు కాపాడాం.. అలాంటి టీడీపీ బనకచర్లకు అనుమతులు తీసుకురాలేదా?’ అని వ్యాఖ్యానించారు.
ఒకవైపు బనకచర్ల అంశం తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్లో, ప్రభుత్వంలో కల్లోలం రేపుతున్నది. ఢిల్లీలో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ బనకచర్లకు అనుకూలంగా సంతకాలు చేసొచ్చారు. దీనిపై తెలంగాణ సమా జం ఆగ్రహంతో ఊగిపోతున్నది. ఈ ప్రాజెక్టును ముందుకు సాగనివ్వొద్దని, అడ్డుకోవాలనే డిమాండ్ బలపడుతున్నది. ఈపరిస్థితుల్లో ఏపీ మంత్రి లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
తండ్రి మాదిరిగానే లోకేశ్ కూడా.. తెలుగు ప్రజలు బాగుండాలని, తెలుగు రాష్ర్టాలు బాగుండాలని సన్నాయి నొక్కులు నొక్కారు. తెలంగాణకు టీడీపీ ఏనాడూ వ్యతిరేకంగా పని చేయలేదని, ఇకపై పని చేయదని చెప్పుకొచ్చారు. ఒకవైపు తెలంగాణ నుంచి గోదావరి జలాలను అక్రమం గా తన్నుకుపోతూ బయటికి మాత్రం 2 రాష్ర్టాల బాగు కోరుతున్నట్టు వ్యాఖ్యానించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.