హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): మానవాళికి శ్వాసకోశ వైద్యనిపుణులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని శ్వాసక్రియ యోగి, గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. శుక్రవారం హెచ్ఐసీసీలోని నోవాటెల్ హోటల్లో ప్రతిష్ఠాత్మక శ్వాసకోశ నిపుణుల నాప్కాన్2023.. 25వ జాతీయ సదస్సు నిర్వహించారు. మూడురోజుల పాటు జరిగే సదస్సులో భాగంగా శుక్రవారం సుదర్శన క్రియా యోగాను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. శ్వాసకోశ సం బంధిత పరిశోధనల ఫలితాలు ప్రజలందరికీ చేరాలని సూచించారు.
భారతీయ యోగ సా ధకుల శ్వాస ప్రక్రియలపై అధ్యయనాలు జరగాలని పేర్కొన్నారు. అనంతరం పలువురు వైద్యనిపుణులు అడిగిన ప్రశ్నలకు సమాధా నం ఇచ్చారు. సదస్సు నిర్వాహక కార్యదర్శి, కామినేని దవాఖాన శ్వాసకోశ విభాగాధిపతి డాక్టర్ శుభాకర్ కంది మాట్లాడుతూ.. శ్వాసకోశ వైద్య నిపుణులను, అధ్యయనకర్తలను ఒక దగ్గరకు చేర్చేందుకు ఈ నాప్కాన్ వేదిక ఉపయోగపడిందని తెలిపారు. శ్వాసకోశ విజ్ఞానంలోని సరికొత్త విషయాలను పంచుకొని, పరస్పర సహకారం, సమన్వయం ద్వారా ప్రగతి సాధించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సుకు 65 దేశాల నుంచి 3వేలకు పైగా వైద్యులు, పరిశోధకులు హాజరయ్యారని వివరించారు. ఇండియన్ చెస్ట్ సొసైటీ, నేషనల్ కాలేజీ ఆఫ్ చెస్ట్ ఫిజీషియన్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ ఆర్ విజయకుమార్, పద్మశ్రీ డాక్టర్ ఫారుఖీ, పద్మశ్రీ డాక్టర్ కిషన్, డాక్టర్ రణ్ దీప్ గులేరియా, డాక్టర్ దీపక్ తల్వరా, డాక్టర్ గౌతమ్ భగత్, డాక్టర్ ఎస్ ఎన్ రావు తదితరులు పాల్గొన్నారు.