హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడిగా రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి నందికొండ నర్సింగరావు ఎన్నికయ్యారు. సంఘం అధ్యక్ష స్థానానికి ఈ నెల 15న ఎన్నికలు జరగగా, ఆదివారం ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. నర్సింగరావుకు 239 ఓట్లు, రాజగోపాల్‌కు 152 ఓట్లు పోలయ్యాయి. 87 ఓట్ల ఆధిక్యంతో నందికొండ నర్సింగరావు అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి, సిటీ సివిల్‌కోర్టు చీఫ్ జడ్జి రేణుక యార ప్రకటించారు. అధ్యక్షుడు మినహా మిగతా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. జనరల్ సెక్రటరీగా సీనియర్ సివిల్ జడ్జి కే మురళీమోహన్, ఉపాధ్యక్షులుగా కే ప్రభాకర్‌రావు, జీ సుదర్శన్, సహాయ కార్యదర్శులుగా దశరథరామయ్య, ఉపేందర్‌రావు, కార్యవర్గ సభ్యులుగా శ్రీవాణి, మండ వెంకటేశ్వరరావు, అబ్దుల్ జలీల్, సాయికిరణ్, సౌజన్య, భవాని, రాజు ముదిగొండ, చందన, ఫర్హీం కౌసర్, ఉషశ్రీ, సంపత్, ప్రతీక్సిహాగ్లు ఎన్నికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 411 మంది న్యాయమూర్తులు సభ్యులుగా ఉండగా, 396 మంది ఓటుహకు వినియోగించుకొన్నారు. సంఘం పదవీకాలం రెండేండ్లు.