హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఒకటేమో నిజాంకాలంలో నిర్మించినది. మరోటేమో 1970, ఇంకోటేమో 1982లో కట్టిన భవనం. కొన్నింటిలో పెచ్చులూడుతున్నాయి. ఇంకొన్నింటిలో వర్షం పడితే చాలు నీళ్లు కారుతున్నా యి. వర్షాలకు నాని నాని ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితిలో మరికొన్ని ఉన్నాయి. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 35 భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇది రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవనాల పరిస్థితి. రాష్ట్రంలో తెరిపినివ్వకుండా వానలు పడుతుండటంతో ఈ కాలేజీల్లో దినదిన గండం అన్నట్టుగా సాగుతున్నది. భారీ వర్షాలకు హైదరాబాద్ నాంపల్లి బజర్ఘాట్లోని ప్ర భుత్వ జూనియర్ కాలేజీ భవనం పైకప్పు కొంత భాగం అకస్మాత్తుగా కూలింది. 55 ఏండ్ల క్రితం నిర్మించిన ఈ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కొంత భాగం కూలిపోయింది.
ఈ భవనంలో ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్‌ల్లో రెండు కాలేజీలను నడుపుతున్నారు. 1,300కు పైగా విద్యార్థులున్నారు. 30 గదుల్లో 10గదులు పూర్తిగా పాడవడంతో వాడటంలేదు. మ రో 20 గదులు అధ్వానస్థితిలో ఉన్నాయి. అయితే గత ఆదివారం సెలవుకావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అదే వర్కింగ్‌డే అయితే జరిగే నష్టాన్ని ఊహించలేం. భవనం కూలిపోవడం, వర్షాలకు నీరు చేరడంతో ఈ కాలేజీకి అధికారులు సెలవు ప్రకటించారు. రాష్ట్రంలో 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలుండగా, 398 కాలేజీలకు సొంత భవనాలున్నాయి. వీటిలో ఆరు భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. 32 కాలేజీలకు అసలు భవనాలే లేవు. శిథిలావస్థకు చేరిన ఈ 35 కాలేజీలకు కొత్త భవనాలు నిర్మించాలని అధ్యాపక సంఘాలు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
పరిస్థితులిలా..
జిల్లాలవారీగా వివరాలు
ఖమ్మం 3, నారాయణపేట 2, నాగర్‌కర్నూల్ 2, నిజామాబాద్ 6, నిర్మల్ 3, హనుమకొండ 2, ఆదిలాబాద్ 2, వరంగల్ 5, ములుగు 1, పెద్దపల్లి 3, కామారెడ్డి 1, మహబూబ్‌నగర్ 2, హైదరాబాద్ 3, యాదాద్రి 1 చొప్పున శిథిలావస్థలో ఉన్నట్టు అధికారిక సమాచారం.